- రాష్ట్ర వ్యాప్తంగా కదంతొక్కిన కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు
- కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు
- విశాఖలో మహాధర్నా
ప్రజాశక్తి- యంత్రాంగం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ పరిశ్రమల్లో సంస్థల్లో పనిచేస్తోన్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తమను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం కదంతొక్కారు. కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు దిగారు. విశాఖలో మహాధర్నా నిర్వహించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేయాలని, దేశవ్యాప్తంగా నాన్ పర్మినెంట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నినదించారు. డిమాండ్స్ డేలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద మహాధర్నాలో వేలాదిమంది కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. దీనికి ముందు ర్యాలీ నిర్వహించారు. మహాధర్నాలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అతి తక్కువ వేతనాలు ఇచ్చి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులతో పని చేయించుకుంటున్నాయన్నారు. 1991 తరువాత సరళీకరణ విధానాల పేరుతో పర్మినెంట్ చేయడం నిలుపుదల చేశారని తెలిపారు. శాశ్వత స్వభావం కలిగిన పనులను, పర్మినెంట్ కార్మికులతో చేయించాల్సిన పనులను కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులతో చేయించుకుంటున్నారన్నారన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు కావడంలేదని, ఉద్యోగం ఉంటుందో, ఉండదోననే ఆందోళనతో యజమానుల దయాదాక్షిణ్యాలపై బతకాల్సిన దుస్థితి ఉందని తెలిపారు. ఇఎస్‌ఐ, పిఎఫ్, గ్రాట్యూటీ, ఎరియర్స్, విడిఎ, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఏమీ వర్తించడం లేదన్నారు. విజయవాడ ధర్నా చౌక్‌లో నిర్వహించిన ధర్నాలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు రాష్ట్ర నాయకులు కె.ఉమామహేశ్వరరావు, ఆర్‌వి.నరసింహారావు, కెఆర్‌కెమూర్తి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నాలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, కంటెంజెంట్, టైంస్కేల్ తదితర పేర్లతో పని చేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయడంలో నిర్లక్ష్యం తగదన్నారు. అనంతపురంలో లలితకళా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు డప్పు వాయిద్యాల నడుమ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ధర్నా చేసి డిఆర్‌ఒకు వినతిపత్రం అందజేశారు. తిరుపతిలో టిటిడి పరిపాలనా భవనం నుంచి పాత మున్సిపల్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి పాత మున్సిపల్ ఆఫీసు వద్ద ధర్నా చేశారు. టిటిడి ఎఫ్‌ఎంఎస్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అల్లూరి జిల్లా జికె.వీధి మండలంలో ఎపి జెన్‌కో సీలేరు కాంప్లెక్స్‌లోని కాంట్రాక్ట్ కార్మికులు చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పాడేరులో ఐటిడిఎ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ వద్ద కార్మికులు ధర్నా చేశారు. శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, పార్వతీపురం, శ్రీకాకుళం, చిత్తూరు, కాకినాడ, భీమవరం, ఒంగోలు, కడప, అన్నమయ్య, గుంటూరు కలెక్టరేట్ల వద్ద, రాజమహేంద్రరంలో సబ్ కలెక్టరేట్ వద్ద, నెల్లూరులో విఆర్‌సి సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద, అనకాపల్లిలో ఆర్‌డిఒ కార్యాలయం ధర్నా నిర్వహించారు.