- బాక్సులోనే టెండర్లు..!
- నాణ్యతాప్రమాణాలు
- పట్టని కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : క్వాలిటీ కంట్రోల్ టెస్ట్‌కు సంబంధించి సెప్టెంబర్ నెలలో టెండర్లు నిర్వహించారు. టెండర్లు నిర్వహించిన తర్వాత వారం, పది రోజుల్లోగా వాటిని తెరవాల్సి ఉంది. ఆ సమయం దాటినా కార్పొరేషన్‌లో క్వాలిటీ కంట్రోల్ టెండర్లను నేటికీ తెరవలేదు. నాణ్యత ప్రమాణాలు తక్కువగా ఉంటే చేసిన పనులకు సంబంధించి నిధుల నుంచి అధికారులు కోత విధించే అవకాశం ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన టెండర్లను తెరవకపోవడంలో సదరు అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తే ఆయనకు విధులపై ఎంతో శ్రద్ధ ఉందో అర్థం అవుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. ఏడాదికి ఒకసారి నిర్వహించే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ టెండర్లకు సంబంధించి నాలుగు సంస్థలు పాల్గొన్నాయి. వీరిలో ముగ్గురు మాత్రమే టెండర్లు దాఖలు చేశారు. గత ఏడాది ఎస్‌ఆర్ ఇంజనీరింగ్ అండ్ ప్లానర్స్ గుంటూరు వారు టెండర్లు దక్కించుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ అండ్ ప్లానర్స్ గుంటూరు వారితోపాటు కర్నూలు సిఈఎస్ కన్‌స్ట్రక్షన్స్, హైదరాబాదుకు చెందిన రెండు ఇంజనీరింగ్ కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి. ఆఖరి నిమిషంలో బివిఆర్.ల్యాబ్స్ హైదరాబాద్ టెండర్ దాఖలు చేయలేదు. దీంతో మూడు సంస్థలు టెండర్లు వేశాయి.ఇవి దాఖలు చేసి ఇప్పటికి 20 రోజులు దాటినా వాటిని తెరవలేదు.
నగరంలో 15 ఫైనాన్స్, ఎన్‌క్యాప్ నిధులతో అభివృద్ధి పనులు జరిగాయి. వాటికి సంబంధించిన నాణ్యతా ప్రమాణాలను తెలియజెప్పే క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ అతి ప్రధానమైనది. టెండర్లు నిర్వహించిన తర్వాత చాలినంత సమయం ఉన్న వాటిని ఉద్దేశపూర్వకంగా తెరవక పోవటంలో ఆ అధికారి ఆంతర్యం ఏమిటోనని గుత్తేదారులు ప్రశ్నిస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న టెండర్లను తెరవకుండా నిర్లక్ష్యం చూపిన ఆ అధికారి, బదిలీ ఉత్తర్వులు అందుకున్న తర్వాత ఆయన లాభం చేకూర్చే ఇతర ఫైళ్లపై మాత్రం సంతకాలు చేశారు. క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ టెండర్లు మాత్రం తెరవకుండా అలాగే ఉంచేశారు. ఈ అంశాలు ఏవీ కమిషనర్ నాగరాజు దృష్టికి వెళ్లకపోవడంతో వారు ఆడిందిఆట పాడింది పాటగా సాగింది. ఇదేఅదనుగా ఒకే హోదాలో విధులు నిర్వహించే ఇద్దరు ఎగ్జిక్యూటివ్ అధికారులు బదిలీపై వెళ్లడానికి ముందు వారికి అవసరం అయిన ఇతరత్రా అన్ని కార్యకలాపాలు చక్కబెట్టిన అధికారులకు క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ బాక్స్ టెండర్లు తెరవాలన్న ఆలోచన రాకపోవడం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ఈ టెండర్లను తెరిపించి, నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు గుత్తేదారులు కోరుతున్నారు.