- గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో కలపాలి
- ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద ధర్నా
ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : విజయనగరం జిల్లాలో నాన్ షెడ్యూల్ గ్రామాలను షెడ్యూల్ ప్రాంతాలలో కలపాలని, జిల్లాలో ఐటిడిఎ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన సోమవారం కలెక్టరేట్ వద్ద గిరిజనులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లోసురేంద్ర మాట్లాడుతూ విజయనగరం జిల్లాలోని ఎస్ కోట, మెంటాడ, రామభద్రపురం, వేపాడ, బొండపల్లి, గజపతినగరం తదితర మండలాల్లో నివసిస్తున్న ఆదివాసీల భూములకు రక్షణ లేకుండా పోతోందని అన్నారు. పోడు భూములకు పట్టాలివ్వకుండా గిరిజనులపై ఫారెస్టు అధికారులు కేసులు పెడుతున్నారని తెలిపారు. తక్షణమే పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మారుమూల గ్రామాల గిరిజనులకు రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు లేవన్నారు. నేటికీ డోలీ మోతలతో రోగులను ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారని, కొంతమంది అక్కడికి వెళ్లేలోగానే ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో కలపకపోవడం వల్ల గిరిజనులంతా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె అవినాష్ కుమార్ మాట్లాడుతూ ఆదివాసీలకు అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి కుటుంబానికీ పదెకరాలు భూమి ఇవ్వాల్సి ఉందన్నారు. ఏళ్ల తరబడి సాగులో ఉండి కూడా వాటికి పట్టాలు ఇవ్వకుండా ఫారెస్టు అధికారులు అడ్డుకుంటున్నారని తెలిపారు. ఆండ్ర రిజర్వాయర్‌లో చేపలు పట్టుకుని జీవన సాగించే ఆదివాసులకు సొసైటీ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని కోరారు. అనంతరం గ్రీవెన్సులో కలెక్టర్ అంబేద్కర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు, గిరిజన సంఘం నాయకులు టి సోములు, బంగారయ్య, రామారావు పాల్గొన్నారు.