గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి
ప్రజాశక్తి-సాలూరు : గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వ హయాంలో ఐటిడిఎలను నిర్వీర్యం చేశారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి విమర్శించారు. గురువారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐటిడిఎలో ఒక్క రూపాయి నిధి లేకుండా చేసిన ఘనత వైసిపిదేనని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని తొమ్మిది ఐటిడిఎల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని వైసిపి పాలకులపై విరుచుకుపడ్డారు. గత ఐదేళ్లలో గిరిజనుల సమస్యలు చెప్పుకోవడానికి గ్రీవెన్స్‌సెల్ కూడా నిర్వహించలేదని విమర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇద్దరు గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు పని చేశారని చెప్పారు. నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ఐటిడిఎ పాలకవర్గ సమావేశం నిర్వహించలేదని ఎద్దేవాచేశారు. పది రోజుల్లో పార్వతీపురం ఐటిడిఎ పాలకవర్గ సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైసిపి హయాంలో గిరిజన సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేశారని చెప్పారు. ట్రైకార్ రుణాలు కూడా మంజూరు కాలేదన్నారు. గిరిజన సంక్షేమ శాఖ పేరిట రూ.250 కోట్ల అప్పు ఉందని, మిగిలిన అన్ని శాఖల రుణాలు తేల్చే పనిలో ప్రభుత్వం ఉందని చెప్పారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే వైసిపి నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలు చేపడుతున్నట్లు ఆరోపణలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని దుయ్యబట్టారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంసం ఎన్నో అరాచకాలకు నిలయంగా మారిందని చెప్పారు. ఏకలవ్య పాఠశాలల్లో ఉత్తరభారత దేశానికి చెందిన ఉపాధ్యాయులను నియమించడం వల్ల వారు హిందీలో బోధన చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారనే విషయంపై సిఎం చంద్రబాబు నాయుడు తో చర్చిస్తానని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాలలో 31 గిరిజన గ్రామాలకు రూ.3 కోట్లతో తాగునీటి పథకాలు మంజూరు చేసినట్లు మంత్రి సంధ్యారాణి చెప్పారు.
