- జగన్‌పై టిడిపి ఎమ్మెల్యే నిమ్మల ఆగ్రహం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎన్నికల్లో ప్రజాతీర్పుపై ఆత్మవిమర్శ చేసుకోకుండా ప్రజలపై నెపాన్ని నెట్టడం సిగ్గుచేటని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలే తనను మోసం చేశారంటూ జగన్ మాట్లాడటం కంటే సిగ్గుమాలిన, హేయమైన చర్య మరొకటి లేదని విమర్శించారు. టిడిపి కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ అరాచక, నిరంకుశ, నియంతృత్వ పాలనను కూకటివేళ్లతో ప్రజలు పెకిలించారని అన్నారు. అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక రాయి కూడా వేయకుండా రాజధాని లేని రాష్ట్రంగా చేశారని పేర్కొన్నారు. పోలవరాన్ని ముంచినందుకే వైసిపిని పాతిపెట్టారని తెలిపారు. పాలకులు అనే వాళ్లు యజమానులు కాదు సేవకులు అనే విషయాన్ని జగన్ మరచిపోయారని చెప్పారు.