తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన జగన్‌ – టిడిపి అధినేత చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సచివాలయం తాకట్టు అనే వార్తపై ఆదివారం సోషల్‌ మీడియా ఎక్స్‌ (ట్విట్టర్‌)లో స్పందించారు. ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? అని జగన్‌ను ప్రశ్నించారు. రాష్ట్రానికి ఎంత అవమానకరం, ఎంత బాధాకరం, ఎంత సిగ్గుచేటు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రూ.370 కోట్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టుపెట్టడం అంటే ఏమిటో ముఖ్యమంత్రికి తెలుసా? అని ప్రశ్నించారు. అసమర్ధ, అహంకార, విధ్వంస పాలనలో ఏం కోల్పోతున్నామో ఆలోచించాలని ప్రజలను కోరారు. ఐదేళ్ల నుంచి జగన్‌ తెస్తున్న అప్పులను చూసి తలపండిన ఆర్థిక వేత్తలకు సైతం మైండ్‌ బ్లాంక్‌ అవుతోందని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మరో ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రాన్ని రూ.12.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్‌.. ఇప్పుడు ఏకంగా సచివాలయాన్ని తాకట్టుపెట్టారని అన్నారు. వైసిపి నాయకులు దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

➡️