జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారు : మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు

Jan 10,2025 17:25 #savitha

తిరుపతి తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమని  బిసి సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. తొక్కిసలాట ఘటనపై ఆమె మాట్లాడుతూ.. “తిరుపతి ఘటనలో కుట్రపూరితంగా చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని కావాలని అలా చేశారు. ఈ విషయంపై క్లారిటీ వచ్చాక మాట్లాడతాం. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతులకు 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మాజీ సీఎం జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారు. సీఎంగా ఉండగా జగన్ ఏమి చేశారో మాకు తెలుసు. బాబాయ్ గొడ్డలి పోటు, కోడికత్తి, గులకరాయి డ్రామాలు తెలుసు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 30 మంది చనిపోయారు. రాజకీయ ఉనికి కోసమే జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారు. జగన్ పాలనపై విరక్తి చెంది జనం 11 సీట్లకు పరిమితం చేశారు. జగన్ ఏనాడైనా జనంలోకి వచ్చారా… దోచుకున్నది దాచుకోవడానికి పరిమితమయ్యారు..” అని వ్యాఖ్యానించారు.

కాగా.. ఈ ఘటనపై తాజాగా అనంతపురం రేంజ్ డీఐజీ స్పందించారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని అనంతపురం రేంజ్ డీఐజీ తెలిపారు. 2500 మంది సిబ్బందితో పది రోజులు పాటు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మొన్న జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని.. ఉహించనిదన్నారు. భక్తుల భద్రతపై పూర్తి భరోసా పోలీసు శాఖ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై భక్తులు వద్ద ఏమైన ఆధారాలు ఉంటే సమర్పించాలని.. దర్యాప్తు సహకరించాలని కోరారు. ఘటన జరిగిన సమయంలో 90 మంది పోలీసులు బైరాగిపట్టడా కేంద్రం వద్ద ఉన్నారని డీఐజీ తెలిపారు. గేటు తెరిచే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారా? లేదా? అన్న దిశగా దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించారు.

➡️