ఇన్‌ఛార్జిల మార్పుపై జగన్‌ కసరత్తు.. కీలక నేతలకు పిలుపు

Jan 30,2024 15:45 #Changes, #ycp incharges

అమరావతి: పార్లమెంట్‌, అసెంబ్లీ ఇన్‌ఛార్జిల మార్పుపై సీఎం జగన్‌ కసరత్తు చేస్తున్నారు. సీఎంవో నుంచి పలువురు సిటింగ్‌ ఎమ్మెల్యేలు, కీలక నేతలకు పిలుపు వచ్చింది. తాడేపల్లి చేరుకున్న వైసిపి నేతలతో జగన్‌ చర్చిస్తున్నారు.మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, ఉష శ్రీచరణ్‌, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పొన్నాడ సతీశ్‌ (ముమ్మిడివరం), పిన్నెల్లి రామకఅష్ణారెడ్డి (మాచర్ల), బుర్రా మధుసూదన్‌ (కనిగిరి), ధనలక్ష్మి (రంపచోడవరం), ఎమ్మెల్సీ అనంతబాబు తదితరులు వచ్చారు. నేతలతో వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే నాలుగు జాబితాలను వైకాపా విడుదల చేయగా.. త్వరలో ఐదో లిస్ట్‌ను వెల్లడించే అవకాశముంది.మరోవైపు ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసిపి రాజకీయం రసవత్తరంగా మారినట్లు తెలుస్తోంది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఆ జిల్లా బాధ్యతలు అప్పగించే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒంగోలు సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి ఆ స్థానాన్ని సీఎం జగన్‌ తిరస్కరించినట్లు తెలిసింది. ఆయన్ను గిద్దలూరు నుంచి పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. తన కుమారుడు ప్రణీత్‌రెడ్డికి ఒంగోలు ఎంపీ సీటును బాలినేని కోరుతున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ సీటు ప్రణీత్‌కు ఇచ్చేదిలేదని బాలినేనికి జగన్‌ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

➡️