జలాశయాల పట్ల జగన్‌ నిర్లక్ష్యం : ఆనం

ప్రజాశక్తి-నెల్లూరు : నీటిపారుదల శాఖపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సరైన అవగాహన లేనికారణంగా రాష్ట్రంలోని జలాశయాల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరించారని, ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సంతపేటలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించి విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే జిల్లాలోని సోమశిల జలాశయం భద్రతపై సిఎం దృష్టి సారించడం సంతోషకరమన్నారు. అందులో భాగంగానే ఆ జలాశయాన్ని సిఎం చంద్రబాబు నాయుడు ఆకస్మికంగా పరిశీలించారన్నారు. త్వరలో సోమశిల జలాశయ మరమ్మతుల పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. సోమశిల నుంచి కండలేరుకు నీరు అందించే హెడ్‌ రెగ్యులేటర్‌ మరమ్మతుల కోసం రూ.ఐదు కోట్లను మంజూరు చేశారన్నారు. క్రస్టు గేట్లతో పాటు ఇతర మరమ్మతులకు నిధులను విడుదల చేస్తామని చెప్పారు. కండలేరులో నీరు లేకపోవడంతో సోమశిల నుంచి రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, ఆనం సంజీవరెడ్డి హై లెవెల్‌ కెనాల్‌ పనులు చేపట్టి పడమటి నాయుడుపల్లి, పొంగూరు రిజర్వాయర్లను పూర్తి చేసి మెట్ట ప్రాంతంలోని 20,000 ఎకరాలకు ఈ ఏడాది సాగునీరు అందించాలని అధికారులను సిఎం ఆదేశించారని తెలిపారు. ఈ సమావేశంలో నెల్లూరు రూరల్‌, కావలి ఎంఎల్‌ఎలుకోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

➡️