- ఇంటర్ బోర్డు గత కార్యదర్శికి కూడా..
ప్రజాశక్తి-అమరావతి : కోర్టు ధిక్కార కేసులో పాఠశాల విద్యాశాఖ గత ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌కు హైకోర్టు జైలుశిక్ష, జరిమానాను విధించింది. ఆయనతోపాటు ఇదే కేసులో ఇంటర్ బోర్డు గత కార్యదర్శి ఎంవి శేషగిరిబాబుకు కూడా శిక్ష విధించింది. వీరిద్దరికీ నెల రోజుల జైలుశిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తీర్పు చెప్పారు. తీర్పుపై అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును నాలుగు వారాలపాటు నిలిపేశారు. వాయిదా వేయాలన్న అధికారుల అభ్యర్థనను ఆమోదించారు. తీర్పుపై ధర్మాసనం స్టే ఇవ్వని పక్షంలో జైలుశిక్ష నిమిత్తం ఈ నెల 21న రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) ముందు లొంగిపోవాలని వారిద్దరినీ ఆదేశించారు. ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో తనకు కూడా ఆ అవకాశం కల్పించాలని కోరుతూ ఇంటర్ బోర్డులో పాలనాధికారిగా పనిచేస్తున్న ఎం విజయలక్ష్మి దాఖలు చేసిన కేసులో హైకోర్టు ఆమె వాదనను ఆమోదించింది. ఆమె ఉద్యోగ విరమణ వయసు పెంపుదల చేయకపోవడంతో దాఖలైన కోర్టు ధిక్కారణ కేసులో వారిద్దరికీ పై విధంగా శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.