బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ను వ్యతిరేకిస్తూ జల దీక్ష

ప్రజాశక్తి – నక్కపల్లి (అనకాపల్లి) : పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే బల్క్‌డ్రగ్‌ పార్క్‌ను ఏర్పాటు చేయొద్దంటూ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట సముద్ర తీరంలో సిపిఎం నాయకులు, స్థానిక మత్స్యకారులు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని జల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం.సత్యనారాయణ, ఎం.రాజేష్‌ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ బల్క్‌డ్రగ్‌ పార్క్‌ శంకుస్థాపనను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. నిర్వాసితులకు అన్యాయం చేస్తూ.. చట్టాలను ఉల్లంఘించి ఈ డ్రగ్‌పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నారన్నారు. విదేశాల్లోనూ, కాకినాడ సెజ్‌లోనూ వ్యతిరేకించిన ప్రమాదకరమైన బల్క్‌డ్రగ్స్‌ పార్క్‌ను రాజయ్యపేట ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికే తీర ప్రాంతంలో రసాయన కంపెనీల ఏర్పాటు వల్ల మత్స్యకారులకు ఉపాధి లేకుండా పోయిందని, బల్క్‌డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తే మత్స్యకారుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల ఏర్పాటు కోసం సేకరించిన భూములకు సంబంధించి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం, ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మైలపల్లి మహేష్‌, జాను, కోడా కాశీరావు, నూకరాజు, కోడా కొండమ్మ, బొంది చిన్నతల్లి, గోసల రమణమ్మ, గోసల మణికొండ పాల్గొన్నారు.

➡️