మణికొండ: నల్లా కనెక్షన్ కోసం లంచం తీసుకుంటూ పట్టుబడిన మణికొండ జలమండలి మేనేజర్ స్పూర్తిరెడ్డిని అధికారులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. మణికొండ మున్సిపాలిటీ నెక్నాంపూర్ వెంకటేశ్వర కాలనీకి చెందిన బమ్మ ఉపేంద్రనాథ్‌రెడ్డి కొత్తగా భవనాన్ని నిర్మించుకున్నారు. భవనం కోసం రెండు కొత్త నీటి కనెక్షన్‌లు తీసుకునేందుకు అధికారులను ఆశ్రయించాడు. దీంతో మేనేజర్ స్పూర్తిరెడ్డి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌గౌడ్ ద్వారా సదరు వ్యక్తి నుంచి రూ.30వేలు లంచం డిమాండ్ చేశారు. అన్ని దస్తావేజులు సరిగ్గా ఉన్నా కనెక్షన్ ఎందుకు ఇవ్వరని బాధితుడు ప్రశ్నించాడు. డబ్బులు ఇస్తేనే కనెక్షన్ అనుమతి ఇస్తామని చెప్పడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం జలమండలి మేనేజర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రూ.30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆ తర్వాత అధికారులు పుప్పాల్‌గూడలోని మేనేజర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అక్రమ ఆస్తులను గుర్తించారు. స్పూర్తిరెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అధికారులు వల వేసి పట్టుకున్నారు. అయితే, సోదాలకు వెళ్లే సమయంలో ఏసీబీ అధికారులకే ఆమె చుక్కలు చూపించారు. దాదాపు రెండుగంటల పాటు తాను ఉంటున్న ఇంటి అడ్రస్‌ను చెప్పలేదు. తప్పుడు అడ్రస్‌లు చెబుతూ అధికారులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు.చివరకు అధికారులు ఇంటి అడ్రస్‌ను తెలుసుకొని వెళ్లారు. అనంతరం సోదాలు నిర్వహించగా అక్రమ ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
