- సిపిఎం నాయకులు బాలకృష్ణ ప్రథమ వర్థంతి సభలో అజశర్మ
ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి : జమిలి ఎన్నికలు రాజ్యాంగ, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ అన్నారు. ప్రజాస్వామ్య విలువలను జమిలి ఎన్నికలు దెబ్బతీస్తాయని తెలిపారు. అనకాపల్లి పట్టణంలోని దొడ్డి రామునాయుడు భవన్‌లో శుక్రవారం సిపిఎం సీనియర్ నాయకులు ఎ.బాలకృష్ణ ప్రథమ వర్థంతిని పురస్కరించుకుని పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గంటా శ్రీరామ్ అధ్యక్షతన ‘రాజ్యాంగ పరిరక్షణ – జమిలి ఎన్నికలు’ అన్న అంశంపై అజశర్మ స్మారకోపన్యాసం చేశారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఒకేసారి జరిగే జమిలి ఎన్నికలను ప్రజలు అడ్డుకోవాలన్నారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ప్రజాస్వామిక విలువలను మోడీ ప్రభుత్వం బలహీనపరుస్తోందని వివరించారు. ఈ ఎన్నికలతో సాధారణ ప్రజలకు మేలు జరగదని తెలిపారు. పార్లమెంట్ చేసే చట్టాలు, రాజ్యాంగ సవరణలు ప్రజాస్వామ్య, రాజ్యాంగ స్ఫూర్తిని బలోపేతం చేసేలా ఉండాలేగానీ బలహీనపర్చేలా ఉండకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను గుర్తు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షకులెవరూ జమిలి ఎన్నికలను సమర్థించరని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేలా ఎన్నికల ఖర్చును ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. తమకు నచ్చని ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే అవకాశం ప్రజలకు కల్పించే ఎన్నికల సంస్కరణలను అమలు చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమం, ప్రజా సంఘాల నిర్మాణంలో బాలకృష్ణ బలమైన పునాది వేశారన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ.. నియంతృత్వానికి దారితీసే జమిలి ఎన్నికలను ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. సిపిఎం నాయకులు బాలకృష్ణ స్ఫూర్తితో కార్మిక, పేదల హక్కుల కోసం పోరాడాలని సూచించారు. బాలకృష్ణ, బుద్ధ శ్రీనివాస్ ఈ ప్రాంతంలో పేద ప్రజల సమస్యలపై అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా తేలికపాటి పదాలతో వివరించి బాలకృష్ణ అందరినీ సమీకరించేవారని అన్నారు. పేదలు, కష్టజీవుల సమస్యలపై పనిచేసేలా కార్యకర్తలను ప్రోత్సహించేవారని కొనియాడారు. రైతాంగ ఉద్యమాలు, సహకార సుగర్ ఫ్యాక్టరీల పరిరక్షణకు అనేక పోరాటాలు నడిపారని తెలిపారు. ముందుగా బాలకృష్ణ, బుద్ధ శ్రీనివాస్ చిత్రపటాలకు నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. బాలకృష్ణ జీవిత విశేషాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, ఆర్.శంకరరావు, డి.వెంకన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు బి.ప్రభావతి, బాలకృష్ణ సతీమణి వరలక్ష్మి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.