కార్పొరేట్లు కోసమే జమిలి

  • రాష్ట్రాల హక్కులను హరించడమే లక్ష్యం : బివి రాఘవులు

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : పెట్టుబడిదారులకు మేలు చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జమిలి ఎన్నికల నినాదాన్ని తెచ్చారని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. విఐ.లెనిన్‌ శత వర్థంతి సందర్భంగా సమకాలీన రాజకీయ పరిణామాలపై సిపిఎం ఆధ్వర్యంలో గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. సభకు సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు అధ్యక్షత వహించారు. రాఘవులు ప్రసంగిస్తూ దేశంలో అన్ని రకాల ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించేందుకు హేతుబద్ధతలేని సాకులను మోడీ ప్రభుత్వం చెబుతోందన్నారు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలను ఒకే దఫాలో నిర్వహించలేక ఏడు దఫాల్లో నిర్వహిస్తున్న ప్రభుత్వం అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి ఎలా నిర్వహించగలదని ప్రశ్నించారు. ఇప్పటికే పోలీసు బలగాలు సరిపోక ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి పంపుతున్నారని, జమిలి ఎన్నికలను మిలటరీ ఆధ్వర్యంలో జరుపుతారా అని ప్రశ్నించారు. ఒకే దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే వివాహ వ్యవస్థ ఉండేలా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలు చేస్తున్నాయన్నారు. ఒకవైపు రాష్ట్రాల హక్కులను హరిస్తోన్న కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ఎత్తుగడ వేస్తోందన్నారు. కార్పొరేట్‌ శక్తులకు, పెట్టుబడిదారులకు మేలు చేసేందుకు ఈ విధానాలు కొనసాగుతున్నాయని, ఇందులో భాగంగా అన్ని వ్యవస్థలకూ దేశం మొత్తం ఒకే కోడ్‌ నెంబరు కేటాయించే ప్రక్రియ జరుగుతోందని వివరించారు. తద్వారా పెట్టుబడిదారులు ఎక్కడి నుంచి అయినా ఏమైనా కొనుగోలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. తద్వారా స్థానిక మార్కెట్లను, రైతులను దెబ్బతీస్తారని తెలిపారు. జమిలీ ఎన్నికలు జరిగితే దేశంలో ప్రజాస్వామ్యం అంతరించిపోయి నియంతృత్వం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హిట్లర్‌ మాదిరిగా ఒకే నాయకుడు ఉండేలా బిజెపి వ్యూహరచన చేస్తోందన్నారు. ఈ ఎన్నికలు అధ్యక్ష తరహా పాలనకు నాంది పలుకుతాయని తెలిపారు. వక్ఫ్‌ చట్టం సవరణల పేరుతో ముస్లిములను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మోడీ విదేశాంగ విధానం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందన్నారు. క్రూడాయిల్‌ను 85 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నా మని, కానీ ఏ దేశంతోనూ మోడీ విధానం సరిగా లేదని తెలిపారు. ఒకవైపు రష్యాతో సఖ్యతగా ఉంటున్నట్టు నటిస్తూ మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో సయోధ్యగా ఉంటారని అన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని వ్యతిరేకించకుండా అమెరికా సామాజ్య్రవాదానికి మోడీ బలపరుస్తున్నారని తెలిపారు. పాలస్తీనాపై దాడి చేస్తున్న ఇజ్రాయిల్‌కు మోడీ అండగా ఉంటున్నారని అన్నారు. ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ వారే 29 రాష్ట్రాల్లో అధికారంలో ఉండాలి… లేదా తాము చెప్పిన పార్టీయే ఉండాలన్న లక్ష్యంతో బిజెపి విధానాలు ఉన్నాయన్నారు. జమిలి ఎన్నికల వల్ల ఫెడరల్‌ వ్యవస్థకు ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. ఇప్పటికే దేశంలో న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించలేకపోతోందన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో కూడా కొలిజయంపై కేంద్రం ఒత్తిడి ఉందని పేర్కొన్నారు. రంజన్‌ గగోరు, అబ్ధుల్‌ నజీర్‌ గతంలో బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం వల్ల వారికి రాజ్యసభ, గవర్నర్‌ పదవులు ఇచ్చారన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు తదితరులు ప్రసంగించారు.

➡️