శాస్త్రీయ భావాల ప్రచారం కోసం బహుళ కార్యక్రమాలు : జన విజ్ఞాన వేదిక

ప్రజాశక్తి, అమరావతి బ్యూరో : శాస్త్రీయ భావాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు బహుళ కార్యకమ్రాలు నిర్వహించాలని జన విజ్ఞాన వేదిక నిర్ణయించింది. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో రెండు రోజులుగా జరుగుతున్న జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్ధాయి వర్క్‌షాపు, రాష్ట్ర కమిటీ విస్తృత స్ధాయి సమావేశం మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ ఎం.గేయానంద్‌, ప్రధాన కార్యదర్శి కుర్రా రామారావు మీడియాతో మాట్లాడారు. శాస్త్ర ప్రచార రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లోను విస్తృతమైన కృషి చేయాలని సమావేశాల్లో నిర్ణయించినట్లు తెలిపారు. విద్యా, వైద్య రంగాల్లో శాస్త్రీయ భావాల ప్రచారం మరింత ప్రణాళిక బద్ధంగా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పర్యావరణ మార్పులు చాలా ముఖ్యమైన అంశంగా మారిందని, ప్రజలకు దీని పట్ల శాస్త్రీయ అవగాహన అవసరమన్నారు. పర్యావరణ నిపుణులు, మేధావులు, సంస్థలను కలుపుకుని ప్రజా చైతన్యం కోసం కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మహిళలు, యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా 500 మంది కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు. చెకుముకి సైన్స్‌ సంబరాలు, ఆన్‌లైన్‌ సైన్స్‌ ఎక్స్పెరిమెంట్స్‌ కాంపిటీషన్స్‌ వంటి కార్యక్రమాలను మరింత సృజనాత్మకంగా తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. మూడనమ్మకాల నిరోధక చట్ట సాధనకు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

➡️