ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో, కుప్పం : ఫిర్యాదుల స్వీకరణకు ‘జననాయకుడు’ పోర్టల్‌ను కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాం. ఈ పోర్టల్ ద్వారా ప్రజలు నేరుగా ఏ సమస్య అయినా చెప్పుకోవచ్చు. ఇక్కడ విజయవంతమైతే ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి కార్యక్రమాన్ని చేపడతాం. ప్రతి అర్జీనీ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తాం. పరిస్థితిని బట్టి ఆర్థిక సాయం చేస్తాం, టెక్నాలజీ ద్వారా శరవేగంగా సమస్యను పరిష్కరిస్తాం’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో రెరడో రోజూ ఆయన పర్యటన కొనసాగింది మంగళవారం ఆయన టిడిపి కార్యాలయంలో ‘జననాయకుడు’ పోర్టల్‌ను ప్రారంభించారు. అనంతరం ఈ పోర్టల్ ద్వారా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో సిఎం మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్)ల్లోనూ, రెవెన్యూ సదస్సుల్లోనూ అందిన ఫిర్యాదులు అపరిష్కృతంగా ఉంటున్నాయని, దీంతో, ఈ పోర్టల్‌ను ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ ఫిర్యాదులు ఆన్‌లైన్లో నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తాయన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు నేరుగా సంబంధిత జిల్లా, రెవెన్యూ డివిజన్ అధికారులతో మాట్లాడుతారని తెలిపారు. అప్పటికీ సమస్య కాకపోతే తానే నేరుగా జోక్యం చేసుకుంటానని ముఖ్యమంత్రి వివరించారు. కుప్పంలో ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా దీనిని అమలు చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు కూడా ఈ పోర్టల్‌లో భాగస్వాములు కావాలని సూచించారు. రాష్రంలో ఇకపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై ఉన్న కేసులన్నీ ప్రత్యేక జిఒ ద్వారా ఎత్తేస్తామని ప్రకటించారు కుప్పంలో జరిగిన గ్రానైట్ అక్రమాలపై దర్యాప్తు చేస్తామన్నారు. పార్టీకి కోటి సభ్యత్వ నమోదు జరగడం ఒక చరిత్ర అని పేర్కొన్నారు. గోదావరి-బనకచర్ల అనుసంధానంతో రాయలసీమ సస్యశ్యామలం అవుతుందన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని స్వర్ణకుప్పం విజన్ 2029 ద్వారా అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటించారు.
1090 అర్జీలు
‘జననాయకుడు’ పోస్టర్ ద్వారా వచ్చిన 1090 అర్జీలను చంద్రబాబు పరిశీలించారు. ఫిర్యాదుల స్వీకరణకు 25 కౌంటర్లను ఏర్పాటు చేశారు. సిఎంకు స్వయంగా తమ సమస్యను చెప్పుకోవడానికి పెద్ద ఎత్తున అర్జీదారులు వచ్చారు. వారి నుంచి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని, అనారోగ్య సమస్యలతో ఉన్న తమకు ఆర్థిక సాయం చేయాలని కోరుతూ ఎక్కువగా అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి ప్రద్యుమ్న, ప్రభుత్వ విప్, ఎంఎల్‌సి కంచర్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
‘కుప్పం’లో పలు శంకుస్థాపనలు
ఎన్‌టిఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వర్ణకుప్పంలో భాగంగా పరిశ్రమలు, పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ చేసుకున్న పలువురికి పరిహారాన్ని అందజేశారు. అక్కడి నుండి కంగుంది గ్రామానికి చేరుకొని శ్యామన్న విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్యామన్న కంగుంది గ్రామ సర్పంచ్‌గా, కళాకారుడిగా, ఉత్తమ రైతుగా పేరుందిన ప్రజ్ఞాశాలి అని కొనియాడారు.