నేడు కల్లితండాలో మురళీనాయక్ అంత్యక్రియలు
ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : పాక్ కాల్పుల్లో వీర మరణం పొందిన మురళీ నాయక్ భౌతికకాయం శనివారం రాత్రి ఆయన స్వగ్రామమైన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకుంది. అంతకుముందు బెంగళూరు విమానాశ్రయంలో సైనిక గౌరవ వందనం అనంతరం భౌతికకాయాన్ని మంత్రి సవితమ్మ, అధికారులకు అందజేశారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కల్లితండాకు తరలించారు. కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. చిన్న వయస్సులోనే తమ కుమారుడి మృతిని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. భౌతికకాయాన్ని చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు, స్నేహితులు, సన్నిహితులు భారీగా తరలివచ్చారు. తమతో ఉన్న అనుబంధాన్ని సన్నిహితులు గుర్తు చేసుకున్నారు. మురళీ నాయక్ కుటుంబాన్ని మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదరు సంపత్ పరామర్శించారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ సిండేతో వీడియో కాల్‌లో మాట్లాడించారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. భౌతికకాయాన్ని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు , కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్.రాజు, హిందూపురం ఎంపి బికె.పార్థసారధి, ప్రముఖ సింగర్ మంగల్లి సందర్శించారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, సత్యసాయి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌లతోపాటు పలువురు ప్రముఖులు ఆదివారం అంత్యక్రియలకు హాజరు కానున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
నేడు అంత్యక్రియలు
ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సామాన్య ప్రజల సందర్శనార్థనం మురళీనాయక్ భౌతికకాయాన్ని ఉంచుతారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి 9.30 గంటల వరకు మిలిటరీ శర్మనీ, అనంతరం అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 గంటల మధ్య మిలటరీ అధికారులు మురళీనాయక్ కుటుంబ సభ్యులకు జాతీయ పతాకాన్ని అందజేస్తారు. అనంతరం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.