జయహో పుస్తకం..వైభవంగా మహోత్సవం

ప్రజాశక్తి, అమరావతి బ్యూరో : సృజనాత్మక శక్తులను పెంపొందించే అభ్యుదయ రచనలు, సైన్స్‌, కథలు, గొప్ప వ్యక్తుల జీవితచరిత్రలు, కథలు, కళలు, పిల్లల కథలు, విజ్ఞానదాయకమైన పుస్తకాలెన్నో విజయవాడ పుస్తకమహోత్సవంలో సాక్షాత్కరించాయి. మనిషి ఉన్నంత వరకూ అక్షరం ఉంటుందని, అక్షరం అంతం కాదని పలువురు పుస్తక ప్రియులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వారి అమూల్యమైన అభిప్రాయాలు, అనుభవాలు వారి మాటల్లో….

63 సంవత్సరాలుగా..
గత 63 సంవత్సరాలుగా పుస్తక ప్రచురణల రంగంలో ముందుకు సాగుతున్నాం. మా సంస్థ ద్వారా ఆంధ్రా, ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల్లోని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లోని లైబ్రరీలకు పుస్తకాలను సరఫరా చేస్తున్నాం.
-ముదిలి శ్రీనివాసరావు, హిమాన్షు పబ్లికేషన్స్‌

ఆసక్తి పెరుగుతుంది
అయితే భాష పరిపుష్టం కావటానికి పుస్తక పఠనం నిరంతరం అవసరం. పుస్తక మహోత్సవంలో అనేక మంచి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేయించే పుస్తకాలు ఉన్నాయి.
-ఎస్‌ఆర్‌. పరిమి, అధ్యక్షులు, వికాస విద్యావనం, పోరంకి

మంచి ఆదరణ
270 స్టాళ్లతో ఈ ఏడాది నిర్వహించటం సంతోషంగా ఉంది. అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పుస్తక ప్రియులు వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
-బెల్లపు బాబ్జీ, గౌరవాధ్యక్షులు, విజయవాడ బుక్‌ఫెస్టివల్‌ సొసైటీ

అభినందనీయం
విజయవాడలో గత కొన్నేళ్లుగా పుస్తక మహోత్సవ కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహిస్తుండటం అభినంద నీయం. విజయవాడ, విశాఖపట్టణంలలో మాత్రమే కాకుండా పట్టణాలకు కూడా పుస్తక మహోత్సవాన్ని తీసుకెళ్లాల్సిందిగా నిర్వాహకు లకు నా మనవి.
-డాక్టర్‌ పెనుగొండ లక్ష్మీనారాయణ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత

అక్షరానికి అంతం లేదు
అక్షరం అంతం కాదు. భాషలు కనుమరుగు కావు. సాహిత్యం ఎప్పుడూ చిరస్థాయిగా నిలుస్తుంది. పాఠకులు మెచ్చేలా మంచి సాహిత్యాన్ని అందించేందుకు మా వంతుగా ముద్రణల ద్వారా కృషి చేస్తున్నాం.
-విశ్వేశ్వరరావు, శ్రీశ్రీ ప్రింటర్స్‌ అధినేత, విజయవాడ

సాంకేతి విప్లవం ద్వారా భాషలు కరుమరుగు కావు
సాంకేతికత, సాంకేతిక విప్లవం ద్వారా భాషలు కనుమరుగు కావు. సాంకేతికతను ఉపయోగించు కుంటూనే పుస్తకాభిలాషను కొనసాగించాలి. మేము ఇలా పుస్తకాలను చదివే ఈ స్థాయికి వచ్చాం. అందువల్ల నేటితరం పిల్లలు, యువత పుస్తక పఠనాన్ని పెంపొందించుకోవాలి.
-రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి, కేంద్రప్రభుత్వ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అనంతపురం

భాషల పరిరక్షణకు దోహదం
గతేడాది ఆఖరిలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభ విజయవాడలో మూడు రోజులపాటు నిర్వహించాం. భాషలు, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణే ధ్యేయంగా ఈ సభలు జరిగాయి. పుస్తకం అనేది ఓ ఉపన్యాసకుడు. ఒంటరితనాన్ని పోగొట్టే గొప్పస్నేహితుడు. పుస్తక పఠనాన్ని పెంపొందించడానికి ఇలాంటి పుస్తక మహోత్సవాలు ఎంతగానో దోహదపడతాయి.
-డాక్టర్‌ జి.వి.పూర్ణచంద్‌, ప్రపంచ తెలుగు రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి

ఊహించనిస్థాయిలో స్పందన
పుస్తక ప్రియుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా యువత ఎక్కువగా స్టాళ్లలో సందర్శించడం మేము గమనించాం. ప్రజాశక్తి బుకహేౌస్‌ ద్వారా ఏర్పాటుచేసిన స్టాల్‌లో పిల్లలు, పెద్దలు, యువత, మహిళలు ఇలా అందరికీ ఉపయోగపడే అనేక రకాలైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కమ్యూనిజం పుస్తకాలకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది.
– కె. లక్ష్మయ్య, జనరల్‌ మేనేజర్‌, ప్రజాశక్తి బుకహేౌస్‌

➡️