నిరుద్యోగులు అధైర్య పడొద్దు

Feb 14,2024 08:06 #Nara Lokesh, #srikakulam

– అధికారంలోకి వస్తే ఏటా జాబ్‌ కేలండర్‌

– శంకారావం సభల్లో నారా లోకేష్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి / విజయనగరం ప్రతినిధి :రాష్ట్రంలో ఉద్యోగాల్లేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి-జనసేన మధ్యలో చిచ్చు పెట్టేందుకు వైసిపి పేటిఎం బ్యాచ్‌ ప్రయత్నిస్తోందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవినీతిపై చర్చించడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? అని జగన్‌కు సవాల్‌ విసిరారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, కురుపాంలో మంగళవారం నిర్వహించిన శంఖారావం సభల్లో ఆయన మాట్లాడారు. ఏటా జాబ్‌ కేలండర్‌ విడుదల చేసి ఖాళీ పోస్టులు భర్తీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాలుగున్నరేళ్లూ నోటిఫికేషన్‌లు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ఏడాదికి 6 వేల కానిస్టేబుల్‌ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మడమతిప్పారని విమర్శించారు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి స్టడీ సర్కిళ్లను మూసేశారని, ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఎత్తేశారని అన్నారు. నిరుద్యోగులు అధైర్యపడొద్దని, టిడిపి-జనసేన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏటా జాబ్‌ కేలండర్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. షర్మిలపై వైసిపి పేటిఎం బ్యాచ్‌ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఇంట్లో మహిళలకే రక్షణ కల్పించలేని వ్యక్తి మనకు రక్షణ కల్పిస్తారా? అని ప్రశ్నించారు. ‘మనం కొన్న భూమి పత్రాలు, సర్వే రాళ్లపైనా జగన్‌ రెడ్డి బమ్మ పెడుతున్నారని, మీ బిడ్డనంటూ చివరకు మీ భూములు లాక్కుంటారు’ అని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమ తీసుకురాలేదని విమర్శించారు. విశాఖలో రూ.500 కోట్ల ప్రజాధనంతో ప్యాలెస్‌ కట్టుకున్నారని, ఆ డబ్బులతో పేదలకు వేల ఇళ్లు కట్టవచ్చని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు తీసుకొచ్చి వాటిపైనా అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. గిరిజనులకు రావాల్సిన 16 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారన్నారు. విశాఖ రైల్వే జోన్‌కు భూములు కేటాయించలేదని తెలిపారు. టిడిపి అధికారంలోకి వస్తే గిరిజనులకు జగన్‌ ప్రభుత్వం రద్దు చేసిన సంక్షేమ పథకాలు తిరిగి ప్రవేశపెడతామని, వంశధార నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వమే నడిపిస్తుందని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్‌జియుకెటి కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు తమకు మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ను వర్తింపజేయాలని లోకేష్‌కు వినతిపత్రం అందజేశారు. సిపిఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని యుటిఎఫ్‌ నాయకులు కోరారు. సభల్లో ఎంపి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, టిడిపి నేతలు కూన రవికుమార్‌, కలమట వెంకటరమణ, నిమ్మల జయకృష్ణ, తోయిక జగదీశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

➡️