ప్రజాశక్తి-ఐతవరం : మరో రెండు రోజుల్లో తాను టిడిపిలో చేరుతానని వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ఐతవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుంటానని తెలిపారు. మైలవరం నియోజకవర్గంలోని కార్యకర్తలతో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్తానని తెలిపారు. టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవన్నారు. పార్టీ హైకమాండ్ సమక్షంలో ఇద్దరం కలిసి అన్నీ మాట్లాడుకుంటామన్నారు. ఇదే సమయంలో సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, నారా లోకేష్‌లను వ్యక్తిగతంగా తిట్టాలని జగన్ చెప్పారని అన్నారు. మైలవరం టికెట్ ఇస్తామని చెపుతూనే వారిని తిట్టాలని అన్నారని చెప్పారు. వైసీపీలో ఉండలేకే టీడీపీలో చేరుతున్నానని తెలిపారు. విపక్ష నేతలను తిట్టే వారికే వైసీపీలో టికెట్లు ఇస్తారని దుయ్యబట్టారు.
