ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరుపై నిర్వహించిన శాఖాపరమైన మదింపులో ఉమ్మడి కృష్ణా జిల్లా మొదటి స్థానంలో, విజయనగరం, ప్రకాశం జిల్లాలు తరువాత స్థానాల్లో నిలిచినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అనంతపురం జిల్లా చివరి స్థానంలో, రాయలసీమలోని మిగిలిన 3 జిల్లాలు జాబితాలో వెనకబడి ఉండటంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ఆయా జిల్లాల డిఎంహెచ్‌ఒలను వివరణ కోరారు. సచివాలయం నుంచి అన్ని జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ను మంత్రి మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్‌టిఆర్ వైద్య సేవల వినియోగంలో రాయలసీమలోని సెకండరీ ఆస్పత్రులు వెనుకబడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం, వివిధ పథకాల అమలును పర్యవేక్షించే జిల్లా వైద్యారోగ్య అధికారులు, జిల్లా ఆరోగ్య సేవల సమన్వయకర్తలు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డిఎంహెచ్‌ఒ కార్యాలయాలపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి అడ్డుకట్ట వేసి జవాబుదారీ తనం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. డిఎంహెచ్‌ఒలకు తగు శిక్షణ ఇవ్వాలన్నారు. ఏడాదికి రెండు పర్యాయాలు వీరి పనితీరును మదింపు చేసి మూడు గ్రేడ్లు ఇవ్వాలన్నారు. కార్యాలయ సిబ్బందిని ప్రతి మూడేళ్లకు తప్పనిసరిగా బదిలీ చేయాలన్నారు. నియామకాల్లో ప్రతిభ ఆధారిత ఎంపిక ఉంటుందనే విషయాన్ని వెల్లడిస్తూ.. అభ్యర్థులు దళారుల బారినపడి మోసపోవద్దన్నారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎమ్‌టి కృష్ణబాబు, సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఎ సిరి, ఇతర విభాగాల అధిపతులు పాల్గొన్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వీరపాండ్యన్ వర్చువల్‌గా పాల్గొన్నారు.
