- జయంతి సభలో మంత్రి కందుల దుర్గేష్
- నలుగురికి కవి కోకిల పురస్కారాలు ప్రదానం
ప్రజాశక్తి – విజయవాడ : ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా అని, సామాజిక చైతన్యం కోసం రచనలు సాగించారని రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కతిక శాఖ ఆధ్వర్యాన శనివారం ఎన్‌టిఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్‌లో నిర్వహించిన గుర్రం జాషువా 129వ జయంతి కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. జాషువా చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ‘కవి’ మాసపత్రిక 50వ సంచికను ఆవిష్కరించారు. కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కళా చిత్రాలను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ తన కవితా ప్రతిభతో తెలుగు సాహితీ లోకంలో ప్రజ్వరిల్లిన తేజోమూర్తి, విశ్వమానవుడు గుర్రం జాషువా అని కీర్తించారు. సమాజంలో నెలకొన్న సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా తన రచనలు సాగించారని తెలిపారు. సామాజిక చైతన్యానికి పెద్దపీట వేసి సాహిత్య ప్రక్రియను సుసంపన్నం చేశారని కొనియాడారు. సామాజిక వ్యవస్థను బాగు చేయడానికి తపించారని వివరించారు. సాంఘిక దురాచారాలను అరికట్టేందుకు తన వంతు ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. సమకాలీన సమాజం పోకడలకు అద్దం పట్టిన కావ్యం గుర్రం జాషువా రచించిన గబ్బిలం అని అన్నారు. మనుషులంతా సమానమనే భావనను కలిగించారని చెప్పారు. జాషువా కవితలు మన జీవితాలను స్పశిస్తాయని, మనిషి జీవితంలోని ఎత్తుపల్లాలను అంటరానితనమనే మనో వైఖల్యాలను వివరిస్తారని అన్నారు. సమాజ హితం కోరుకున్నారని చెప్పారు. జాషువా సాహిత్య వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భాషా సాంస్కతిక శాఖ ఎంపిక చేసిన కర్రి సంజీవరావు (శిఖామణి), దుగ్గినపల్లి ఎజ్రా శాస్త్రి, టి.వరప్రసాద్, పి.రమణయ్యలకు గుర్రం జాషువా కవి కోకిల పురస్కారం -2024 ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఒక్కో పురస్కార గ్రహీతకు జ్ఞాపికతోపాటు రూ.50 వేలు అందించారు. ఈ కార్యక్రమంలో యువజనాభ్యుదయం, పర్యాటక, సాంస్కతిక శాఖ కార్యదర్శి వాడ్రెవు వినయ్ చంద్, ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన, భాషా, సాంస్కతిక శాఖ సంచాలకులు ఎ. శ్రీనివాస్, పూర్వ సంచాలకులు మల్లికార్జున్ పాల్గొన్నారు.