Journalist Health Scheme : ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం పొడిగింపు

Jul 16,2024 15:12 #health insurance, #Journalist

అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ 12.07.2024న జీవో యం.యస్ నెం. 82 ను జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ తెలిపింది. జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఏదైనా అనుకోని అనారోగ్యం సంభవించిన ప్రతిసారి రూ. 2 లక్షల వరకు విలువ చేసే వైద్యసేవలు అందుతాయని, ఇలా సంవత్సర కాలంలో ఎన్నిసార్లైనా పరిమితులు లేకుండా ఈ సదుపాయాన్ని అందిస్తారని తెలిపారు. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) తరహాలో వైద్య సేవలు పొందవచ్చు. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా పొందే వైద్యసేవల విషయంలో ఎలాంటి ఆదాయ పరిమితులు లేవు. అదే విధంగా నిర్దేశిత చికిత్సలకు సంబంధించి ఉచిత ఓపీ సేవలు పొందవచ్చు. అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నట్లు  సమాచార, పౌర సంబంధాల శాఖ పేర్కొంది.

www.cfms.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ క్రింద తెలిపిన పద్దుకు రూ .1250 లు చెల్లించి 31.03.2025 వరకు లబ్ధి పొందవచ్చు

Head of Account: 8342-00-120-01-03-001-001
DDO Code: 2703-0802-003

ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు జత చేయవలసిన కాపీలు

1.ఒరిజనల్ చలానా

2.అక్రిడిటేషన్ జిరాక్సు

3. హెల్త్ స్కీమ్ దరఖాస్తు

4. కుటుంబ సభ్యుల ఫోటోలు, ఆధార్ కార్డుల కాపీలను జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, కార్యాలయంలో పనివేళల్లో అందజేయాల్లి. అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ  తెలిపింది.

➡️