రిషితేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి : ఐద్వా

Nov 30,2024 21:36 #aidwa, #family, #justice, #Rishiteshwari's

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులకు శిక్ష లేకుండా కోర్టు కొట్టివేయడం విచారకరమని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి ప్రభావతి, డి రమాదేవి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కేసులో ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లడంతోపాటు రిషితేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించాలన్నారు. రిషితేశ్వరి ఎదుర్కొన్న వేధింపులను స్పష్టంగా తన డైరీలో రాసుకుందన్నారు. హారుల్యాండ్‌లో జరిగిన ఫంక్షన్‌లో ప్రొఫెసరు నుంచి ఎదురైన వేధింపుల గురించి డైరీలో పేర్కొందన్నారు. ఆ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా కోర్టు తీర్పు చెప్పడం శోచనీయమని, వేధింపులకు గురవుతున్న ఆడపిల్లలకు, తల్లిదండ్రులకు ఈ తీర్పు భరోసానిచ్చేదిగా లేదన్నారు. ప్రాసిక్యూషన్‌ సక్రమంగా వ్యవహరించి ఉంటే నిందితులు తప్పించుకోవడం సాధ్యపడేది కాదన్నారు. సుదీర్ఘకాలం నిందితులను అరెస్టు చేయకుండా ఉండటంతోనే ఆనాడు అనుమానాలు వ్యక్తమయ్యాయని పేర్కొన్నారు.

➡️