‘లా’ విద్యార్థినికి న్యాయం చేయాలి

  • గ్యాంగ్‌ రేప్‌ నిందితులను కఠినంగా శిక్షించాలి
  • ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : విశాఖ నగరంలో గ్యాంగ్‌ రేప్‌కు గురైన ‘లా’ విద్యార్థినికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి డిమాండ్‌ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఐద్వా, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాల ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. సమీపంలోని రహదారిపై మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలపై అకృత్యాలు రోజురోజుకూ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలో లా విద్యార్థినిని మోసం చేయడంతోపాటు లైంగికంగా హింసించే పనిలో పలువురిని ప్రధాన నిందితుడు భాగస్వాములను చేశాడని, వారి బారి నుంచి బయటపడే మార్గంలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తెలిపారు. రాష్ట్రంలో ఇటువంటి వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. గ్యాంగ్‌ రేప్‌ నిందితులు వంశీ, ఆనంద్‌ జగదీష్‌, రాజేష్‌లను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. గంజాయి, మద్యం, మత్తు పదార్థాలను నిషేధించాలన్నారు. రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై అత్యాచారాలు పెరిగాయని తెలిపారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు మాసాలు అయినప్పటికీ వాటిని నివారించడంలో విఫలమైందని విమర్శించారు. ఐదు నెలల కాలంలో ఒక్క కేసుపై కూడా విచారణ సవ్యంగా సాగలేదని, నిందితులకు శిక్షలు పడలేదని తెలిపారు. మహిళలు, ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్‌ దేశంలో పురుషాధిక్యత విషయం తెలియదని చెప్పడం సరికాదన్నారు. సనాతన ధర్మం పేరిట స్త్రీలను అణచివేస్తున్నారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సనాతన ధర్మం పేరిట కులమతాలను రెచ్చగొడుతున్నారన్నారు. వరుస అత్యాచార ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం నిపుణులతో కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి, విశాఖ జిల్లా కార్యదర్శి వై.సత్యవతి, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యుఎస్‌ఎన్‌.రాజు, కె.సంతోష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎల్‌జె.నాయుడు, మాజీ కార్పొరేటర్‌ బొట్టా ఈశ్వరమ్మ, వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థినులు పాల్గొన్నారు. లా విద్యార్థినికి న్యాయం చేయాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి, పాయకరావుపేట, నర్సీపట్నం ప్రాంతాల్లో ధర్నాలు, మానవహారాలు నిర్వహించారు.

➡️