‘కాళేశ్వరం’ విచారణ

Jun 11,2024 23:28 #'Kaleshwaram, #trial

25లోపు అఫిడవిట్లు సమర్పించాలి
తప్పుడు సమాచారమిస్తే చట్టపరచర్యలు
త్వరలో నిర్మాణ సంస్థలనూ పిలుస్తాం
– జస్టిస్‌ పిసి ఘోష్‌
ప్రజాశక్తి -హైదరాబాద్‌ బ్యూరో:కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యంపై విచారణకు హాజరైనవారంతా ఈనెల 25లోపు అఫిడవిట్లు సమర్పించాలని కాళేశ్వరం జ్యుడిషీయల్‌ విచారణ కమిషన్‌ చైర్మన్‌ పిసి ఘోష్‌ ఆదేశించారు. తప్పుడు సమాచారంతో అఫిడవిట్లు ఇస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో మీడియాతో మంగళవారం ఆయన చిట్‌చాట్‌ చేశారు. కాళేశ్వరం విచారణలో భాగంగా 20 మంది ఇంజినీర్లతో సమావేశమైనట్టు తెలిపారు. త్వరలో నిర్మాణ సంస్థలనూ విచారణకు పిలుస్తామని ప్రకటించారు. ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో అధికారుల పేర్లు ఉంటే, వారికి కూడా నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు. బ్యారేజీలు సరిగ్గా పనిచేస్తే, ప్రజలకు ఎంతో లాభం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. బ్యారేజీలతో లాభమే తప్ప నష్టం లేదని అనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు. కమిషన్‌ చేసే పనులపై బుధవారం జాబితా తయారుచేస్తామని వివరించారు. మూడు బ్యారేజీల బాధ్యతలు చూసిన ఇంజనీర్లను విచారిస్తున్నామనీ, అఫిడవిట్‌ ద్వారా విషయాలు తెలియజేయాలని వారిని ఆదేశించామని తెలిపారు ‘అఫిడవిట్‌ ద్వారా అన్ని అంశాలు రికార్డు అవుతాయి..బ్యారేజీల విషయంలో లెక్కలు ఎక్కడో తప్పినట్టు కనిపిస్తున్నది. లోపం ఎక్కడుంది ? ఎవరి ప్రమేయమైనా ఉందా ? తదితర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం’ అని జస్టిస్‌ పీసీ ఘోష్‌ వ్యాఖ్యానించారు.

➡️