ప్రశ్నార్థకంగా కల్లుగీత వృత్తి

  • ఎక్స్‌గ్రేషియా ఎందుకు ఇవ్వడం లేదు?
  • తణుకులో ప్రారంభమైన ఎపి కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభ

ప్రజాశక్తి -తణుకు రూరల్‌ :  వైసిపి ప్రభుత్వం గీత వృత్తిని నాశనం చేసి, గీత కార్మికుల ఉపాధిని దెబ్బతీసిందని, ఫలితంగా కల్లుగీత వృత్తి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవి.రమణ తీవ్రంగా విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రెండు రోజులు పాటు నిర్వహించనున్న ఎపి కల్లుగీత కార్మిక సంఘం 15వ రాష్ట్ర మహాసభ మంగళవారం ప్రారంభమైంది. తొలిరోజు తణుకు మున్సిపల్‌ కార్యాలయం నుంచి నరేంద్ర సెంటర్‌, వెంకటేశ్వర సెంటర్‌ మీదుగా లయన్స్‌క్లబ్‌ ఆడిటోరియం వరకూ గీత కార్మికులు మోకులు ధరించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంఘం ఏర్పడి 80 వసంతాలు పూర్తయిన సందర్భంగా సభ నిర్వహించారు. ఈ సభకు ఆహ్వాన సంఘం అధ్యక్షులు కామన మునిస్వామి అధ్యక్షత వహించారు. తొలుత సంఘం జిల్లా నాయకులు చిటకన వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రమణ మాట్లాడుతూ.. రాష్ట్రాలు వేరైనా వృత్తిపరంగా, భాషపరంగా మనందరం ఒక్కటేనన్నారు. ఈ రాష్ట్రంలో గీత కార్మికుల బతుకులు మారాలని మోకులు ధరించి రోడ్లపైకి వస్తున్నామంటే జగన్‌మోహన్‌రెడ్డి పాలన ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. ఎక్కడైనా ప్రమాదాలు సంభవిస్తే రూ.30 లక్షలు, రూ.50 లక్షలు ఇస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి, చెట్టు ఎక్కిన గీత కార్మికుడు ప్రమాదవశాత్తూ మరణిస్తే ఎందుకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వృత్తి రక్షణ, ఆధునికీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కల్లుగీత కార్మిక సంఘం మాజీ జిల్లా గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్‌ మాట్లాడుతూ… పాదయాత్రలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని సిఎం జగన్‌ను ప్రశ్నించారు. తాటి, ఈత చెట్లపై గీత కార్మికులకు హక్కు లేకుండా చేసి వృత్తిని దెబ్బతీశారన్నారు. వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ ఎం.భాస్కరయ్య మాట్లాడుతూ.. నూతన పాలసీలో రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వని ఘనత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానిదేనని విమర్శించారు. తమ ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల ప్రణాళిక ప్రకటించిన వారికే తమ మద్దతు ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జుత్తిగ నరసింహమూర్తి, నేతలు గుబ్బల వీరరాఘవులు, కడలి పాండు, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, వివిధ సంఘాల నేతలతోపాటు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ దొమ్మేటి వెంకటసుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️