- రాష్ట్రస్థాయి అవార్డుకు ముగ్గురు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రముఖ రచయిత, సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి కందుకూరి వీరేశలింగం పంతులు 177వ జయంతిని పురస్కరించుకొని తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో ముగ్గురికి కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 26 జిల్లాలకు గానూ జిల్లా స్థాయిలో 107 మంది ప్రతిభగల నాటక రంగ కళాకారులు, సాంకేతిక నిపుణులను కందుకూరి విశిష్ట పురస్కారాలకు ఎంపిక చేసింది. అవార్డులను బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాయంత్రం ఆరు గంటలకు జరిగే సభలో ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎపి స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు శుక్లా వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. రాష్ట్రస్థాయి పురస్కారాలకు ఆరాధ్యుల వెంకటేశ్వరరావు (తెనాలి), డాక్టర్ కందిమల్ల సాంబశివరావు (చిలకలూరిపేట), డాక్టర్ గుర్రాల రవికృష్ణ (నంద్యాల) ఎంపికయ్యారు. ఒక్కొక్కరికి రూ.లక్ష నగదు బహుమతితోపాటు ప్రశంసాపత్రాన్ని అందజేయనున్నారు. జిల్లాస్థాయిలో కందుకూరి విశిష్ట సేవా పురస్కారానికి ఎంపికైన 107 మందికి రూ.10 వేలు చొప్పున నగదు బహుమతితోపాటు ప్రశంసాపత్రాన్ని అందజేయనున్నారు. ఈ పురస్కారాలను ఎంపిక చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం నాటక రంగ ప్రముఖులతో ఎంపిక కమిటీని నియమించింది. ఈ కమిటీకి సినీ రచయిత డాక్టర్ బుర్రా సాయిమాధవ్ ఛైర్మన్‌గానూ, గుమ్మడి గోపాలకృష్ణ, పాటిబండ్ల ఆనందరావు, చిక్కాల బాలాజీ, కెకెఎల్ స్వామి, పి బాలాజీనాయక్, దాసరి చలపతిరావు (గంగోత్రిసాయి), జి పద్మజ, బుద్ధాల వెంకటరామారావు సభ్యులుగా నియమితులయ్యారు. ఎపి ఎఫ్‌డిసి మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు శుక్లా సమన్వయకర్తగా కమిటీ సమావేశమై ఈ పురస్కార గ్రహీతలను ఎంపిక చేసి ఆ నివేదికను మంత్రి దుర్గేష్‌కు అందజేసింది.
పారదర్శకంగా ఎంపిక : మంత్రి దుర్గేష్
నాటక రంగంలో కృషి చేసిన వారికి రాష్ట్ర స్థాయిలో కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారంతోపాటు రూ.లక్ష నగదు, జిల్లా స్థాయిలో ఎంపికైన వారికి కందుకూరి విశిష్ట పురస్కారంతో పాటు రూ.10 వేల నగదును అందజేయనున్నామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కళా, నాటక రంగాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వివరించారు.