రైతుల ఉద్యమంపై కంగనా వ్యాఖ్యలు సిగ్గుచేటు : ఎపి రైతు సంఘం

  • జాతీయ రహదారిపై నిరసన

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్‌ (గుంటూరు జిల్లా) : రైతాంగం మెడలు విరిచే మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సంవత్సర కాలంపాటు దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన మహా ఉద్యమంపై బిజెపి ఎంపి కంగనా రనౌత్‌ చౌకబారు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకరరెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం జాతీయ రహదారిపై ఎపి రైతు, వ్యకాస నాయకులు మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే రైతన్న రోడ్డెక్కి తమ హక్కుల కోసం పోరాటం చేశారని, ఆ పోరాటంలో 700 మందికిపైగా అమరులయ్యారని తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కార్పొరేట్‌ వ్యవసాయాన్ని తీసుకొచ్చేందుకు కుట్ర పన్నిందన్నారు. వ్యవసాయ రంగాన్ని విచ్ఛిన్నం చేసే మూడు నల్ల చట్టాల రద్దు కోసం రైతులు సాగించిన ఉద్యమాన్ని అవహేళన చేసిన ఎంపి కంగనా రనౌత్‌ వెంటనే రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని కోరారు. ఎపి వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… రైతుల పోరాటంపై కంగనా రనౌత్‌ వ్యాఖ్యలను ఖండించారు. ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశార్నారు. ధర్నాలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ, గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️