ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్ర జలవనరులశాఖ ప్రభుత్వ సలహాదారుగా రిటైర్డు ఇంజినీరు, గేట్ల నిర్వహణ నిపుణులు కన్నయ్య నాయుడును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల తుంగభద్ర డ్యామ్ గేట్ వరదల్లో కొట్టుకుపోయినప్పుడు డ్యామ్‌లో నీరు వున్నా గేట్ స్థానంలో స్టాప్‌లాగ్ పెట్టి నీటి వృథాను అరికట్టడంలో విజయవంతం కావడం వెనుక కన్నయ్య నాయుడు కృషి వుంది. దీంతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతుల పరిశీలనకు కన్నయ్య నాయుడును సలహాదారుగా నియమించింది. గత ఐదేళ్ల కాలంలో పులిచింతల ప్రాజెక్టు, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి. అలాగే అన్నమయ్య, పించా, పెదవాగు ప్రాజెక్టులు వరదలకు కొట్టుకుపోయాయి. భవిష్యత్‌లో ప్రాజెక్టుల నిర్వహణ పర్యవేక్షణకు సలహాదారుగా వుండేందుకు ప్రభుత్వం కన్నయ్య నాయుడును జలవనరులశాఖకు సలహాదారుగా నియమించింది.
