- గేట్ పాస్‌లు పునరుద్ధరించాలని ఇడి ఆఫీసు ముట్టడి
- కొనసాగుతున్న ఆందోళన
- నేడు ప్రాంతీయ లేబర్ కమిషనర్ (సెంట్రల్) వద్ద చర్చలు
ప్రజాశక్తి- ఉక్కునగరం (విశాఖపట్నం) : స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు కన్నెర్ర చేశారు. తమను విధుల నుండి తొలగించే యత్నాలను మానుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో ఇడి వర్క్స్ భవనాన్ని మంగళవారం ముట్టడించారు. వీరి పోరాటానికి కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. రాత్రి 11 గంటల సమయంలో కూడా ఆందోళన కొనసాగుతోంది. ఇంతకాలం స్టీలు ప్లాంటు గేటు బయట వివిధ రకాల నిరసనలకు, ఆందోళనలకు పరిమితమైన కార్మికులు కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఏమాత్రం మార్పు లేకపోవడంతో మంగళవారం ఇడి వర్క్స్ కార్యాలయం వద్దకు దూసుకువెళ్లారు. వేలాదిమంది నినాదాలు చేస్తూ ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో నిరసనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కార్మికులను చెదరగొట్టడానికి, ఇడి కార్యాలయం నుండి పంపివేయడానికి భద్రతా సిబ్బంది, పోలీసులు పలు దఫాలు ప్రయత్నం చేశారు. అయితే, కాంట్రాక్టు కార్మికులు ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో పాటు వారి సంఖ్య మరింత పెరిగింది. మరోవైపు రెగ్యులర్ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు కూడా అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు మద్దతు తెలిపారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. కార్మికుల ఆందోళన ఉధృతం అవుతుండటంతో కార్మిక సంఘాల నేతలను అధికారులు చర్చలకు పిలిచారు. అయితే, కాంట్రాక్టు కార్మికులను ఒక్కరిని కూడా విధుల నుండి తొలగించకూడదని, ఉద్యోగ భద్రత కల్పించాలన్న కీలకమైన డిమాండ్లను పరిష్కరించడం తమ పరిధిలో లేదని అధికారులు చేతులెత్తేశారు. దీంతో కాంట్రాక్టు కార్మికులు తమ డిమాండ్లు పరిష్కరించేంతవరకు అక్కడి నుండి కదిలేది లేదని ప్రకటించారు.
అర్ధరాత్రి సమయంలో కూడా అక్కడే బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. కాంట్రాక్టు కార్మికులకు మద్దతుగా బుధవారం ఉదయం 10 గంటలకు అఖిలపక్ష కార్మిక సంఘాలు రాస్తారోకోకు పిలుపునిచ్చాయి. కాగా, రీజినల్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) వద్ద ఉక్కు యాజమాన్యం, కాంట్రాక్టు కార్మికుల సంఘాలతో ఉదయం 10.30 గంటలకు చర్చలు జరగనున్నాయి.
ఏం జరిగింది…?
గత నెల ఒకేసారి 4,200 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తూ, ఆన్‌లైన్‌లో వారి గేట్ పాసులను రద్దు చేస్తూ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం నిర్ణయించిన సంగతి తెలిసిందే ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని స్టీల్‌ప్లాంట్ యాజమాన్యంతో మాట్లాడడంతో తాత్కాలికంగా కాంట్రాక్టు కార్మికులను బయోమెట్రిక్ లేకపోయినప్పటికీ పనిచేసుకోవడానికి లోపలికి అనుమతించారు. తాజాగా గేట్ పాసుల రంగు మార్చి బయోమెట్రిక్ లేని వారిని స్టీల్‌ప్లాంట్‌లోకి అనుమతి ఇవ్వరనే వార్త దావానంలా విశాఖ స్టీల్‌ప్లాంట్ మొత్తం వ్యాపించింది. ఇప్పటి వరకు ఇచ్చిన పసుపు రంగు పాసులకు బదులు తెలుపు రంగు పాసులు ఇస్తారని వార్త రావడంతో ఒక్కసారిగా కార్మికులు కోపోద్రిక్తులయ్యారు. పసుపు రంగు పాస్ ఉంటే ప్లాంట్‌లోకి వెళ్లడానికి మూడు నెలల వరకూ అనుమతి ఉంటుంది. తెలుగు రంగు పాస్ అయితే నెల రోజులు మాత్రమే అనుమతి ఇస్తారు. ఈ నేపథ్యంలో మంగళవారం సుమారు ఆరు వేల మంది కార్మికులు ఇడి వర్క్స్ భవనాన్ని ముట్టడించారు. తమ సమస్య పరిష్కరించే వరకూ ఇక్కడి నుంచి కదిలేదిలేదని కార్మికులు తేల్చి చెప్పారు. కార్మిక సంఘాల నేతలతో ఇడి వర్క్స్ అధికారులు జరిపిన చర్చల్లో కాంట్రాక్ట్ కార్మికులకు పాత పద్ధతిలోనే పాస్‌లు జారీ చేయాలని, ఒకరిని కూడా విధుల్లో నుంచి తొలగించడానికి వీలులేదని ్ల కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ అంశం తన పరిధిలో లేదని స్టీల్‌ప్లాంట్ సిఎమ్‌డి దృష్టికి తీసుకెళ్తామని, అక్కడి నుంచి అనుమతి వచ్చాక అందరికీ గేట్ పాసులు మంజూరు చేస్తామని ఇడి వర్క్స్ అధికారులు హామీ ఇచ్చారు.