- వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం
- మృతుల్లో ముగ్గురు విద్యార్థులు, భార్యాభర్తలు
ప్రజాశక్తి- యంత్రాంగం : రోడ్లు రక్తమోడాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. వారిలో ముగ్గురు విద్యార్థులు, భార్యాభర్తలు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం… కర్ణాటక రాష్ట్రం హంపిలో కొలువైన శ్రీనరహరి తీర్థుల పూజ విషయంలో గత 26 సంవత్సరాలుగా మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి మఠానికి, ఉత్తరాధి మఠానికి వివాదం నడిచింది. మంత్రాలయం మఠానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో విజయోత్సవంతోపాటు తొలి ఆరాధనను ఘనంగా నిర్వహించేందుకు శ్రీమఠం పీఠాధిపతులు శ్రీసుభుదేంద్రతీర్థుల ఆదేశాల మేరకు శ్రీమఠం యాజమాన్యం తుపాను వాహనంలో పది మంది విద్యార్థులతో మంత్రాలయం నుంచి మంగళవారం రాత్రి బయల్దేరింది. కర్ణాటక రాష్ట్రంలోని సింధనూర్-పోతునాళ పట్టణాల మధ్య వారి వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మంత్రాలయంలోని శ్రీగురు సార్వభౌమ సంస్కృత విద్యాపీఠం విద్యార్థులు మంత్రాలయం కొప్పళ, గంగావతికి చెందిన సుజయీంద్ర (19), అభిలాష్ (21), హయవదన (22), వాహనం డ్రైవర్ శివ (22) మృతి చెందారు. వాహనం నుజ్జునుజ్జు అయింది.
విశాఖ జిల్లా గాజువాక నుంచి అగనంపూడి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలు మన్మధరావు (41), అరుణకుమారి (34)లను భారీ ట్రాలర్ ఢకొీట్టింది. దీంతో, వీరిద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అగనంపూడికి చెందిన వీరు బ్యాంకు పని నిమిత్తం గాజువాక వెళ్లి తిరిగి వస్తుండగా జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. మన్మధరావు ఫార్మా సిటీలో ఉద్యోగం చేస్తున్నారు.
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : సీఎం చంద్రబాబు
కర్నాటకలో జరిగిన రోడ్డు ప్రమాదం వార్త దిగ్భ్రాంతిని, తీవ్ర ఆవేదనను కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. హంపికి వెళుతూ పొరుగు రాష్ట్రంలో ప్రమాదానికి గురైనవారికి అవసరమైన వైద్య సాయం అందేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. మృతి చెందిన వేద విద్యార్థుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు.
మంత్రులు లోకేశ్, రాంప్రసాద్‌రెడ్డి దిగ్భ్రాంతి
కర్నాటక రోడ్డు ప్రమాదంపై మంత్రులు నారా లోకేశ్, ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి లు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని చెప్పారు. మఅతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్.జగన్
” కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి కర్నాటకలోని హంపీ ఆరాధన కార్యక్రమాలకు వెళ్తుండగా…వాహనం బోల్తా పడిన ఘటనలో ముగ్గురు వేదపాఠశాల విద్యార్ధులు, డ్రైవర్ చనిపోయిన ఘటన అత్యంత బాధాకరం. ఈ ఘటన తీవ్ర దిగ్భాంత్రికి గురి చేసింది. .చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడాలని కోరుతున్నాను ” అని ఓ ప్రకటనలో వైఎస్.జగన్ పేర్కొన్నారు.