- టిడిపి కూటమి సర్కారు తీరుపై స్థానికుల ఆగ్రహం
ప్రజాశక్తి- కడప ప్రతినిధి/కాశినాయన : వైఎస్‌ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని కాశినాయన క్షేత్రానికి చెందిన స్నానపు గదులను, కుమ్మరుల, రజకుల అన్నదాన సత్రాలను, గోశాల, గెస్ట్‌హౌస్‌లను అటవీశాఖ అధికారులు కూల్చివేయడం దుమారం రేపుతోంది. అటవీ ప్రాంతంలో ఇవి ఉన్నాయనే సాకుతో అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారు అదాని, అంబాని వంటి పారిశ్రామికవేత్తలకు అటవీ ప్రాంతంలో ఇష్టానుసారంగా వేలాది ఎకరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో సామాన్యులు, పేదలు, యాత్రికుల ఆకలిని తీరుస్తున్న అన్నదాన సత్రాన్ని ఇతర వసతి సదుపాయలపై ప్రభుత్వం విరుచుకుపడటం కలకలం రేపింది. నాలుగు రోజుల క్రితం కూల్చివేసిన అన్నదాన సత్రాన్ని అన్నమయ్య కళాపీఠానికి చెందిన విజయశంకరస్వామిజీ పరిశీలించారు. సనాతన ధర్మాన్ని కాపాడతామనే పేరుతో వచ్చిన పవన్‌కల్యాణ్, చంద్రబాబు… కాశినాయన క్షేత్రం పట్ల వివక్ష చూపడం విస్మయాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు.
పవన్ కల్యాణ్ శాఖలోనే…
సనాతన ధర్మాన్ని తలకెత్తుకున్నానని పదేపదే ప్రకటించిన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు చెందిన అటవీశాఖలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అన్ని దానాల్లోకెల్లా అన్న దానం గొప్పదని హిందూ ధర్మం చాటి చెబుతుండగా దానికి భిన్నంగా కూల్చివేతలకు ఎలా దిగుతారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.కాశినాయన క్షేత్రానికి చెందిన పలు అన్నదాత సత్రాలు, ఇతర వసతి సదుపాయాలను తొలగించాలని అటవీశాఖ అధికారులు కొంత కాలంగా హకుం జారీ చేస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని స్థానికులు పలువురు పవన్‌కల్యాణ్‌ను కోరినట్లు సమాచారం. అయినా, అటవీ అధికారులు విధ్వంసానికి దిగడంతో ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాలతోనే ఈ చర్యకు పాల్పడి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎన్‌డిఎ హయాంలో హిందూ సంస్కృతి నాశనం : విజయశంకర స్వామిజీ
కేంద్ర, రాష్ట్రంలోని ఎన్‌డిఎ, టిడిపి కూటమి ప్రభుత్వాలు హిందూ ధర్మం పేరుతో హిందువులను రాజకీయంగా వాడుకుని హిందువుల సంస్కృతి, సంప్రదాయాలను నాశనం చేస్తున్నాయని అన్నమయ్య కళాపీఠానికి చెందిన విజయశంకరస్వామిజీ అన్నారు. కూల్చివేతలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ 1967 చట్టం నోటీసుల జారీ పేరుతో ఫారెస్ట్ అధికారులు వసతి సదుపాయాలను ధ్వంసం చేస్తుంటే హిందూ ప్రతినిధులమని చెప్పుకునే నాయకులు, హిందూ సంస్థలు ఏమిచేస్తున్నాయని ప్రశ్నించారు. కాశినాయన క్షేత్రంలో ఇప్పటి వరకు ఎనిమిది కట్టడాలను కూల్చివేశారని తెలిపారు. కూల్చివేతలకు నిరసనగా ఈ నెల 17న అన్నమయ్య కళాక్షేత్రం, జయభారత్ సంస్థ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట నిరసనకు ఆయనకు పిలుపునిచ్చాం. అటవీ శాఖ పరిధిలోని 30 ఎకరాలను, కట్టడాలను, స్థలాన్ని కాశినాయన ట్రస్టుకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాశినాయనలోని సదుపాయాల కూల్చివేతలతోపాటు తిరుమలలోని వరాహస్వామి ఆలయ సమీపంలోని తాళ్లపాక అన్నమాచార్యుల గృహాన్ని, అన్నమయ్య, హనుమంతుని విగ్రహాలను కూల్చేయడాన్ని ఏమనుకోవాలో తెలియడం లేదన్నారు
కూల్చివేతకు పాల్పడినవారిపై చర్యలు : లోకేష్
ఈ చర్య దుమారం రేపడంతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకని అన్నదాన సత్రాన్ని కూల్చివేసిన అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వీలైనంత త్వరగా తన సొంత నిధులతో అదేచోట సత్రం పునర్నిర్మిస్తామని తెలిపారు. తన పిఎను కూడా సంఘటన స్థలానికి పంపారు.
ఫారెస్ట్ భూములు బదలాయించాలి – జి.చంద్రశేఖర్, సిపిఎం, జిల్లా కార్యదర్శి. కడప.
ఫారెస్ట్ భూములకు సరిపడా రెవెన్యూ భూములు కేటాయించాలి. 1800 సంవత్సరలో బ్రిటీష్ హయాంలోని రెవెన్యూ రికార్డుల్లో నరసింహస్వామి ఆలయంగా ఉంది. ఇటువంటి ప్రశాంత ప్రదేశంలో కాశినాయన అనే సాధువు తపస్సు చేసుకునేవారు. ఇటువంటి ప్రదేశంలోని భూములు కేంద్రప్రభుత్వ పరిధిలోని టైగర్‌జోన్, వైల్డ్‌లైఫ్ శాంక్షురీ పరిధిలోకి వెళ్లిన భూములను కాశినాయన ట్రస్టుకు అప్ప గించాలి. తాజాగా కూల్చిన ఆశ్రమ వసతి సదుపాయాలను పునర్మించాలి.
భవనాలు కూల్చడం బాధాకరం : బిసివై
కాశినాయన క్షేత్రంలో భవనాలు కూల్చడం బాధాకరమని బిసివై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఈ క్షేత్రాన్ని సందర్శించి అక్కడ కులదొచ్చినటువంటి కొన్ని భవనాలను పరిశీలించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూల్చివేతల వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉందని, దీనికి పూర్తి బాధ్యత వారే వహించాలని అన్నారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహజ ధర్మం అని తిరుగుతూ హిందూ ధర్మాన్ని మోసం చేస్తున్నారని విమర్శించారు.