- వృత్తిగా గుర్తించాలి
- నాల్గవ తరగతి ఉద్యోగులుగా నియమించాలి
- ధర్నాలో వక్తలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కాటికాపరుల వృత్తిని గుర్తించాలని, ఇప్పటికైనా నాల్గవ తరగతి ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్య్పాప్తంగా కాటికాపరులు మంగళవారం నాడు విజయవాడకు తరలివచ్చారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి నల్ల చొక్కాలు, తెల్ల పంచలు, ఎర్ర కండువా ధరించి ధర్నా చౌక్ వరకూ ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన అనంతరం ధర్నా చౌక్‌లో డిమాండ్ల సాధన కోసం ధర్నా నిర్వహించారు. శ్మశానంలో గుంతలు తీసి, పూడ్చే, కాల్చే కాటికాపరుల సంఘం(కెవిపిఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాకు ఎన్‌జికెఎస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.జి కృష్ణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… ఉన్నాడో లేడో తెలియని దేవుడి కోసం గుళ్లలో పూజలు చేసే పూజారులకు, మసీదుల్లోని మౌలాకు, చర్చిల్లోని పాస్టర్‌కు గౌరవ వేతనం అందిస్తున్న ప్రభుత్వాలు తరతరాలుగా ఎవరు చనిపోయినా శ్మశానంలో గుంతలు తీసి పూడుస్తూ, కర్రలు పేర్చి కాల్చే వృత్తిదారులకు ఎలాంటి భృతిని కల్పించకపోవడం పాలకుల దుర్మార్గానికి నిదర్శనమన్నారు. మూగబోయిన మీ గొంతుకను శాసన మండలిలో తాను వినిపిస్తానని, అయితే సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకూ పోరుబాటను కొనసాగించాలని సూచించారు. కాటికాపులు వేసుకున్న నలుపు చొక్కా నిరసనకు నిదర్శమని, ఎర్ర కండువా విఫ్లవానికి సంకేతమని, చేతి కర్రే ఆయుధంగా ప్రభుత్వానికి హెచ్చరికను తెలియజేయాలని కోరారు. కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ… సమస్త వృత్తులను గుర్తించి సహకారం అందిస్తున్న పాలకులకు, ఎవరు సచ్చినా భుజానెత్తుకుని మోసి, గుంతలు తీసి పూడుస్తూన్న, కర్రలు పేర్చి కాలుస్తున్న కాటికాపరుల వృత్తి ఎందుకు గుర్తుకు రావడం లేదని ప్రశ్నించారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా ఒక ప్రధాన వృత్తిని వృత్తిగా గుర్తించాలని ఆందోళన చేయాల్సి రావడం దారుణమన్నారు. ఎస్‌జికెఎస్ రాష్ట్ర నాయకులు ఎండి ఆనంద్‌బాబు మాట్లాడుతూ… ఎవరు చనిపోయినా గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించే వీరికి మాత్రం అవమానాలు, చీత్కారాలు మిగిలాయన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా ప్రత్యేకంగా చర్చించి కాటికాపరులుగా పని చేస్తున్న వారందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి, నాల్గవ తరగతి ఉద్యోగులుగా నియమించాలని కోరారు. ఉపాధి వయస్సు నిండిన వారందరికీ రూ.8 వేలు పెన్షన్ ఇవ్వాలని, వృత్తి పరికరాలైన గడ్డపార, రెండు చలికలు, రెండు గంపలు, గ్లౌజు, బూట్లు, డ్రస్సు, ట్రార్చ్‌లైట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎపి డికెఎస్ రాష్ట్ర కార్యదర్శి క్రాంతికుమార్ మాట్లాడుతూ… శ్మశానాలకు ప్రహరీ గోడ నిర్మించడంతోపాటు కబ్జాకు గురికాకుండా కాపాడాలన్నారు. వృత్తిలో భాగంగా వ్యాధుల పాలయ్యే కాటికాపరులకు ప్రమాద, ఆరోగ్యబీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాను ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర నాయకులు కె.ఉమామహేశ్వరరావు, ఎస్‌సి, ఎస్టి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు బందెల కిరణ్ రాజు, జైభీమ్ యాక్టివిస్ట్ చింతా వెంకటేశ్వర్లు, కెవిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శులు సహాయ కార్యదర్శులు నటరాజ్, కె.రంగమ్మ, నాయకులు రమణ, కాటికాపర్ల సంఘం జిల్లా నాయకులు యోగానంద్, జయమ్మ, కరుణాకర్, హుస్సేనమ్మ ప్రసంగించారు. అన్ని జిల్లాల నుంచి కాటికాపరులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.