- డియస్‌యంయం జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : కాటి కాపరులు తమ సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని దళిత సోషణ్ ముక్తి మంచ్ (డియస్‌యంయం) జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. వారి పోరాటాలకు సిపిఎం అండగా నిలుస్తుందని అన్నారు. స్మశానంలో గుంతలు తీసి, పూడ్చి కాల్చే కాటికాపరుల రాష్ట్ర సదస్సు విజయవాడ క్త్రీస్తురాజుపురం సున్నపుబట్టీల సెంటర్‌లోని పూలే అంబేథ్కర్ భవన్‌లో బుధవారం జరిగింది. సంఘ రాష్ట్ర నాయకులు జి.కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో శ్రీనివాసరావు మాట్లాడుతూ కాటికాపరులకు ప్రభుత్వాలు సరైన, గుర్తింపు, గౌరవం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆలిండియా ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ కాటికాపరులకు ప్రభుత్వాలు భూమి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తేనే గౌరవ ప్రదంగా జీవించగలరని అన్నారు. కాటికాపరుల సమస్యలను వ్యవసాయ కార్మిక సంఘం, డియస్‌యంయంలు సంయుక్తంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళతామని అన్నారు. కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దళితులకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటోందన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తగినన్ని దళితుల అభివృద్దికి అవసరమైన నిధులు కేటాయించడం లేదని అన్నారు. ఐక్య ఉద్యమాలతోనే నిధులు రాబట్టుకోగలని అన్నారు. సంఘ రాష్ట్ర నాయకులు ఎండి ఆనంద్‌బాబు మాట్లాడుతూ జిల్లా, మండల స్తాయిల్లో స్మశానవాటికల్లో సర్వేలు నిర్వహించి వృత్తిలో ఏఏ కులాలున్నాయో గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించాలన్నారు. కెవిపిఎస్ ఉపాధ్యక్షులు జి.నటరాజ్, ఓ.రంగమ్మ, డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్, నాయకులు రమణ, యోగానంద్, హుస్సేన్ తదితరులు సభలో పాల్గొన్నారు.