ముఖ్యమంత్రి జగన్‌కు సెక్యూరిటీ పెంచాలి -కేశినేని నాని డిమాండ్‌

Apr 14,2024 00:18 #Keshineni Nani, #speech

ప్రజాశక్తి- గన్నవరం (కృష్ణా జిల్లా):ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి సెక్యూరిటీ భారీగా పెంచాలని విజయవాడ వైసిపి పార్లమెంట్‌ అభ్యర్థి కేసినేని నాని డిమాండ్‌ చేశారు. విజయవాడలో ముఖ్యమంత్రిపై రాయితో దాడి వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా పరిగణించాలని, దీనిని ఎలక్షన్‌ కమిషన్‌ దఅష్టికి తీసుకెళ్తానని చెప్పారు. శనివారం ఆయన గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో జగన్‌ బస శిబిరం వద్ద విలేకర్లతో మాట్లాడారు. విజయవాడలో బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఒక పథకం ప్రకారం చంద్రబాబు ఈ దాడి చేయించారని ఆరోపించారు. ఒక పథకం ప్రకారమే జగన్‌ సొంతంగా దాడి చేయించుకున్నారని సోషల్‌ మీడియాలో నారా లోకేష్‌ ట్రోలింగ్‌ చేస్తున్నారని, దీనిద్వారా ఆయన నైజం బయటపడిందని నాని విమర్శించారు. ఏం చేసినా జగన్‌ స్పీడును ఆపలేరన్నారు. రాయితో దాడి చేసిన వ్యక్తిని వదిలే ప్రసక్తి లేదని తెలిపారు. అతడిని పోలీసులు పట్టుకొని వాస్తవాలు బయటకు తీయాలని కోరారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఈ రాయి దాడికి చంద్రబాబు సమాధానం చెప్పాలని, లేకుంటే ప్రజా కోర్టులో ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు.

➡️