‘అన్నప్రసాదం’ విరాళానికి కియోస్క్‌ మిషన్లు

ప్రజాశక్తి- తిరుమల : ఎస్‌వి అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో కియోస్క్‌ మిషన్‌ను టిటిడి ఏర్పాటు చేసింది. టిటిడి అడిషనల్‌ ఇఒ సిహెచ్‌ వెంకయ్య చౌదరి బుధవారం దీనిని ప్రారంభించారు. టిటిడికి ఈ మిషన్‌ను విరాళంగా కెనరా బ్యాంకు అందించింది. ఈ మిషన్ల ద్వారా సందర్శకులు ఎస్‌వి అన్నప్రసాదం ట్రస్టుకు సులభతరంగా విరాళం అందిచవచ్చు. రూ.1 నుండి రూ.99,999 వరకు తమకు తోచిన మొత్తాన్ని సందర్శకులు కియోస్క్‌ మిషన్‌లోని క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి యుపిఐ ద్వారా విరాళం ఇవ్వవచ్చు. ఈ సందర్భంగా అడిషనల్‌ ఇఒ మీడియాతో మాట్లాడుతూ టిటిడిని పూర్తిగా డిజటలైజేషన్‌ చేయడంలో భాగంగా ఈ మిషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కియోస్క్‌ మిషన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ ఇఒలు లోకనాథం, రాజేంద్ర, కెనరా బ్యాంకు డిజిఎం రవీంద్ర అగర్వాల్‌, ఎజిఎం నాగరాజురావు, తిరుమల బ్రాంచ్‌ మేనేజర్‌ రాఘవన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️