హైదరాబాద్ : సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో మూడు రోజుల పాటు కైట్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఫెస్టివల్ పోస్టర్‌ను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… వివిధ రాష్ట్రాలకు చెందినవారు ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటారని తెలిపారు. ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్, స్కాట్‌లాండ్, మలేషియా, ఇటలీ, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ సహా మొత్తం 50 దేశాలకు చెందిన దాదాపు 150 మంది ఫ్లయర్స్ కైట్ ఫెస్టివల్‌లో పాల్గొంటారని తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఫెస్టివెల్ ఉంటుందన్నారు. గ్రామాల్లో కూడా సంస్కృతి, సంప్రదాయాలు పెంపొందించేలా పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రాచీన కట్టడాలను, దేవాలయాలను పరిరక్షించాల్సి ఉందన్నారు. తెలంగాణ టూరిజం అందుకు తోడ్పాటును అందిస్తుందన్నారు.