ప్రజాశక్తి – ఎడ్యుకేషన్ (విజయవాడ) : కెఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష -2025 పోస్టర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష, విద్యా విధానం, మెరిట్ విద్యార్థులకు ఇచ్చే రాయితీలు, స్కాలర్షిప్ విధానం గురించి యూనివర్సిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. యూనివర్సిటీ విద్యార్థులు ఇటీవల సాధించిన ప్రగతి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంశాల గురించి ముఖ్యమంత్రి ఆరా తీశారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సారధివర్మ మాట్లాడుతూ.. యూనివర్సిటీ అందించే ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి మూడు విడతలుగా దేశవ్యాప్తంగా ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మొదటి విడత ప్రవేశ పరీక్షను డిసెంబర్ ఆరు నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించే అన్ని రకాల ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు ధీటుగా కెఎల్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోస్టర్ ఆవిష్కరణలో యూనివర్సిటీ ప్రో ఛాన్సులర్ డాక్టర్ జగన్నాధరావు, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు పాల్గొన్నారు.