కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి అరెస్ట్‌

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : బిఆర్‌ఎస్‌ నేత, కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం ఫిల్మ్‌ నగర్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకొని వికారాబాద్‌లోని డిటిసి సెంటర్‌కు తరలించారు. వికారాబాద్‌ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో పట్నం నరేందర్‌రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు విచారించారు. అనంతరం కొడంగల్‌ కోర్టులో హాజరు పర్చగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌ విధించారు. లగచర్ల ఘటనలో కీలక నిందితులు సురేశ్‌తో ఘటన జరిగిన రోజున నరేందర్‌రెడ్డి పలుసార్లు ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు చెప్తున్నారు. మణికొండలో నివాసముంటున్న సురేశ్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అధికారులపై దాడి ఘటనలో మంగళవారం 16 మందిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు బుధవారం మరో నలుగురిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో 47 మందిని పోలీసులు గుర్తించారని, వారిలో 19 మందికి అసలు భూమే లేదని, మరికొంతమందికి ఉన్నా, వారి భూములు భూ సేకరణ పరిధిలో లేవని మల్టీ జోన్‌ ఐజి సత్యనారాయణ తెలిపారు. ఫార్మా సిటీ భూ సేకరణకు సోమవారం వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులు లగచర్ల గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లారు. అక్కడ రైతులతో కలెక్టర్‌ మాట్లాడుతుండగా కొంతమంది వ్యక్తులు కర్రలు, రాళ్లతో అధికారులపై దాడి చేశారు.

➡️