ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : అక్టోబరు నాలుగు నుంచి 12 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటల వరకు ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణంతో పాటు తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు. శుద్ధి అనంతరం శ్రీవారి దర్శనానికి యాత్రికులను అనుమతించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం దృష్ట్యా అష్టదళ పాద పద్మారాధన, విఐపి బ్రేక్ దర్శనాలను టిటిడి రద్దు చేసింది. ఈ సందర్భంగా టిటిడి ఇఒ జె.శ్వామలరావు మాట్లాడుతూ.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా టిటిడిలోని అన్ని విభాగాలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి ముందు వచ్చే మంగళవారం ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు తెలిపారు.