-జలదిగ్బంధంలో లంక గ్రామాలు
-ఏలూరు-కైకలూరు రోడ్డుపైకి పోటెత్తిన వరద
-నీట మునిగిన చేపల చెరువుల గట్లు
ప్రజాశక్తి- యంత్రాంగం:వరుస తుపాన్ల ప్రభావం, ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో కొల్లేరు ఉగ్రరూపం దాల్చింది. ఏలూరు జిల్లాలో చిన్నఎడ్లగాడి, పెదఎడ్లగాడి పరిసర ప్రాంతాలతోపాటు ఏలూరు-కైకలూరు రహదారిపైకి వరద నీరు చేరింది. లంక గ్రామాలను వరద చుట్టేసింది. వరద మరింత పెరిగితే ఊళ్లపై విరుచుకుపడే ప్రమాదం ఉండడంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏలూరు-కైకలూరు రహదారిపై మోకాలి లోతు నీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పెనుమాక, ఇంగిలిపాక, నందిగామ లంక, కొవ్వాడ లంక, నుచ్చుమిల్లి, మానూరు, కలకుర్రు, మణుగూలూరు గ్రామాలకు వరద పోటెత్తింది. దీంతో, కొల్లేరువాసులు బిక్కుబిక్కుమంటున్నారు. సాధారణ రోజుల్లో కొల్లేరులో సగటున రెండు మీటర్ల నీటిమట్టం ఉంటుంది. శుక్రవారం ఉదయానికి ఇది 3.30 మీటర్లకు చేరింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2020 అక్టోబరులో కొల్లేరు ఉగ్రరూపం దాల్చి సమీప గ్రామాలను ముంచెత్తింది. అప్పట్లో గరిష్ట నీటిమట్టం 3.50 మీటర్లుగా నమోదైంది. అంటే, నీటిమట్టం ఇంకో 20 సెంటీమీటర్లు పెరిగితే తీర గ్రామాలు ముంపులో చిక్కుకున్నట్లే. మరోపక్క కొల్లేరులోకి నీరు వేగంగా లాగకపోవడంతో దానిలో కలిసే మురుగు కాలువలన్నీ బిగదన్నుతున్నాయి. ప్రస్తుతం చినకాపవరం, ఆలకోడు, తుమ్మకోడు తదితర కాలువల్లో వరద నీరు పలుచోట్ల గట్లను తాకుతూ ప్రవహిస్తోంది.
గోదావరి, శబరి స్వల్పంగా తగ్గుముఖం
గురువారం వరకూ ఉప్పొంగి ప్రవహించిన గోదావరి, శబరి, ఇతర కొండవాగులు శుక్రవారం ఉదయం నుంచి తగ్గుముఖం పట్టారు. అయినా, అల్లూరి జిల్లాలోని ముంపు మండలాల ప్రజలను మాత్రం భయం వెంటాడుతూనే ఉంది. వారం రోజులపాటు గోదావరి ప్రవాహం తగ్గుతూ.. పెరుగుతూ ఉండొచ్చని సిడబ్ల్యుసి అధికారులు చెబుతుండడంతో విఆర్.పురం, కూనవరం, చింతూరు, ఎటపాక మండలాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చింతూరు వద్ద శబరి 26 అడుగులుగా నమోదైంది. విఆర్.పురం మండలంలోని రహదారులు పలుచోట్ల ఇంకా ముంపు నుంచి బయటపడలేదు. చింతూరు మండలంలో మల్లెతోట గ్రామాన్ని చుట్టుముట్టిన వరద నీరు క్రమేపీ తగ్గుతోంది. సోకులేరు వాగు ఉధృతి పూర్తి స్థాయిలో తగ్గకపోవడంతో విఆర్.పురం, చింతూరు రహదారి జలదిగ్బంధంలోనే ఉంది. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం కివ్వాకలో మిర్చి నాట్లు నీట మునిగాయి. వేలేరుపాడు మండలంలో వరద ప్రభావం కొనసాగుతోంది. 20 గ్రామాలకు రాకపోకలు నిల్చిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాటన్ బ్యారేజీ వద్ద కొనసాగున్న 1వ ప్రమాద హెచ్చరిక
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు 41.50 అడుగులకు తగ్గింది. దీంతో, అక్కడ మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద నీటి ప్రవాహం నిలకడగా ఉంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 12.10 అడుగుల నీటిమట్టం నమోదైంది. బ్యారేజీ 175 గేట్లను పైకిలేపి 10,36,440 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు సాగు, తాగు నీటి అవసరాల నిమిత్తం 2,300 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. వరద నేపథ్యంలో రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన రెండు పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. రాజమహేంద్రవరంలోని గోదావరి నది మధ్యలో ఉన్న బ్రిడ్జిలంకకు చెందిన 108 మందిని, కేతావారి లంకకు చెందిన 120 మందిని అధికారులు ఈ పునరావాస కేంద్రాలకు తరలించారు.
