విఠపు బాలసుబ్రమణ్యంకు ‘కొమ్మారెడ్డి కేశవరెడ్డి’ అవార్డు

ప్రజాశక్తి – ఒంగోలు సబర్బన్‌ : ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ సీనియర్‌ నాయకులు, ఐక్య ఉపాధ్యాయ పత్రిక మాజీ సంపాదకులు, అనువాదకులు, సాహితీవేత్త కొమ్మారెడ్డి కేశవరెడ్డి స్మారక సాహితీ అవార్డును మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త విఠపు బాలసుబ్రహ్మాణ్యానికి ప్రదానం చేశారు. ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, ప్రొఫెసర్‌, ప్రముఖ చరిత్రకారుడు కొపర్తి వెంకటరమణ మూర్తి, కేశవరెడ్డి కుటుంబసభ్యులు ఈ అవార్డును అందించారు. విద్యారంగానికి, ఉపాధ్యాయ ఉద్యమానికి, సమాజానికి విఠపు బాలసుబ్రహ్మణం చేసిన సేవలను కొనియాడారు. ఎపి యుటిఎఫ్‌, సాహితీ స్రవంతి, ప్రజాశక్తి బుకహేౌస్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఒంగోలులోని అంబేద్కర్‌ భవన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. యుటిఎఫ్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కె శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ.. కేశవరెడ్డి ఒక ఉపాధ్యాయుడిగా, రచయితగా, అనువాదకుడిగా దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఆయన జీవితం ఎంతో ఆదర్శప్రాయమైనదని తెలిపారు. ప్రముఖ చరిత్రకారుడు, ప్రొఫెసర్‌ కొపర్తి వెంకటరమణమూర్తి స్మారక ఉపాన్యాసం చేశారు. మన దేశ చరిత్రను వక్రీకరించే కుట్ర జరుగుతోందన్నారు. చరిత్రతోపాటు సామాజిక శాస్త్రాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని తెలిపారు.

మొఘలాయిల చరిత్ర, మహ్మదీయుల చరిత్రను తొలగిస్తున్నారని వివరించారు. ఇండియాను భారత్‌గా పేరు మార్చే కుట్ర జరుగుతోందన్నారు. మతంలో విశ్వాసం ఒక్కటే ఉంటుందని, విశ్వాసం ఎప్పుడు ప్రశ్నించదని, అటువంటి విశ్వాసాలను ఆయుధంగా చేసుకొని లౌకిక దేశంలో విచ్ఛినానికి కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధారాలు లేని చరిత్రలను బలవంతంగా ప్రజలమీద రుద్దుతున్నారని, మేధావులు దీన్ని ప్రతిఘటించాలని కోరారు. యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. భౌతికంగా కేశవరెడ్డి మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన రచనలు, ఆశయాలు మన మధ్య ఉన్నాయని తెలిపారు. సాహితీ అవార్డు గ్రహీత, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. కొమ్మారెడ్డి కేశవరెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

కార్యక్రమంలో లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ రిటైర్ట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ డి ఆంజనేయరెడ్డి, కేశవరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి, ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ బాధ్యులు కె.లక్ష్మయ్య, సాహితీ స్రవంతి నాయకులు ఎవి పుల్లారావు, యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవి, వీరారెడ్డి, డి ఆంజనేయులు, ప్రముఖ రచయిత్రి టి.అరుణ, ఆల్‌ పెన్సర్స్‌ అసోషియేషన్‌ నాయకులు జి శేషయ్య తదితరులు పాల్గొన్నారు. దాచూరి రామిరెడ్డి విద్యాకేంద్రం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు అతిథులు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి జెవివి నాయకులు కె సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. త్వరలోనే దాచూరిరామిరెడ్డి విజ్ఞాన కేంద్రం తరపున ప్రకాశం జిల్లాలో బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

➡️