ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిఎస్‌ఆర్‌టిసి ప్రయాణికులపై ఛార్జీల భారం పడకుండా చర్యలు తీసుకుంటామని సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ఆవరణలోని ఆర్‌టిసి హౌస్‌లో ఆయన ఛైర్మన్‌గా శనివారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తగా బస్సులు కొనుగోలు చేసి, గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని సంస్థను లాభాల బాటలో నడిపిస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామన్నారు. ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి సంస్థకు ఖర్చు తగ్గించనున్నట్లు తెలిపారు. కార్గో సేవలను మరింత విస్తరిస్తామన్నారు. ప్రమాదాలు లేకుండా 99 శాతం బస్సులను ప్రజలకు సౌకర్యవంతంగా ఆర్‌టిసి నడుపుతోందని అన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రెండు ఇంద్ర సర్వీసులను ప్రారంభించారు. అంతకుముందు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రులు మడింపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, పలువురు శాసన సభ్యులు, ఆర్‌టిసి అధికారులు బ్రహ్మానందరెడ్డి, చంద్రశేఖర్, రవివర్మ, ఎంవై దానం, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
