ప్రతి ధాన్యం గింజా కొంటాం : మంత్రి నాదెండ్ల మనోహర్‌

ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా జిల్లా) : రైతుల అధైర్యపడొద్దని, ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ రైతులకు హామీ ఇచ్చారు. ఫెంగల్‌ తుపాను ప్రభావంతో కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలో తడిసిన వరి ధాన్యాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ చివరి గింజ వరకు మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతు సేవా కేంద్రంలో తేమ శాతానికి, రైస్‌ మిల్లర్ల వద్ద తేమ శాతానికి వ్యత్యాసం ఉంటుందని తెలిపారు. రైతు సేవా కేంద్రంలో ఇచ్చిన తేమ శాతమే ప్రామాణికమని, మిల్లర్లు ఇబ్బంది పెడితే తెలియజేయాలని, వారిని బ్లాక్‌ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోపే ప్రభుత్వం నుండి రైతు ఖాతాలో డబ్బులు జమ చేసే ప్రక్రియ జరుగుతోందన్నారు. 30 నుండి 40 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ మూడు రోజుల్లో జరగడంతో సంచులు, ట్రాన్స్‌పోర్ట్‌, మద్దతు ధర, నెంబర్ల విషయాల్లో కొంత ఇబ్బందులు జరిగాయని, వాటన్నిటిని సరిచేస్తామని చెప్పారు. అనంతరం మాజేరులో జాతీయ రహదారిపై రైతులు ఆరబెట్టుకున్న ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని, రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు.

➡️