- పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
- అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలి
- మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా రావాలంటే కృష్ణా యాజమాన్య బోర్డును ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో పెట్టాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. రాయలసీమతో పాటు రాష్ట్రాంలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, వాటికి నిధులు కేటాయించాలని కోరారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి అధ్యక్షతన కర్నూలు సూరజ్ గ్రాండ్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శోభనాద్రీశ్వరరావు మాట్లాడారు. శ్రీశైలం నుంచి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కోసం వందల టిఎంసిల నీళ్లు వాడేస్తోందని, మన ప్రభుత్వం ఎందుకు కట్టడి చేయడం లేదని ప్రశ్నించారు. వేసవిలో నీటి సమస్య వస్తే ఎలా అధిగమిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం జలాశయంలో ఏర్పడిన భారీ గొయ్యి వల్ల జలాశయానికి ప్రమాదం ఉందని నిపుణుల కమిటీలు చెబుతున్నా జగన్, చంద్రబాబు ఇద్దరికీ పట్టలేదన్నారు. చంద్రబాబు దూరదృష్టి ఉన్న వ్యక్తి అయినా వ్యవసాయం, రైతులపై కంటే విదేశీ పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలపైనే ఆసక్తి ఉందని విమర్శించారు. ప్రయివేటు రంగంతోనే అభివృద్ధి అనే ఆలోచనలో వెళుతున్నారన్నారు. పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేస్తుందని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీర్మానం చేస్తే ఇరిగేషన్ కాంపొనెంట్‌కు మించి ఇవ్వబోమని, హోదా కాకుండా ప్యాకేజీ ఇస్తామని చంద్రబాబు సమ్మతితోనే మోడీ ప్రభుత్వం ప్రకటన చేసిందన్నారు. అమరావతిలో ఇప్పటికే ప్రభుత్వ భవనాలు నిర్మించి ఉన్నా మళ్లీ రూ.40 వేల కోట్లతో ఐకానిక్ భవనాలను నిర్మిస్తామంటున్నారని, అవసరం లేని వాటి మీద కాకుండా అవసరం ఉన్న వాటి మీద ఖర్చు చేయాలని కోరారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైనా కర్నూలులో హైకోర్టు బెంచి భవనాల నిర్మాణానికి ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు. హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. గోదావరి నుంచి బనకచర్లకు నీళ్లు తీసుకురావడం ఆచరణ సాధ్యం కాదని, అవసరం లేనిదని చెప్పారు. పట్టిసీమ నుంచి గోదావరి జలాలను తీసుకొచ్చి నాగార్జున సాగర్ ఆయకట్టుకు వాడుకోవచ్చని, ఆ దిశగా అన్ని సంఘాలతో చర్చించాలని కోరారు. మళ్లీ టిడిపి అధికారంలోకి వచ్చినా గుండ్రేవులకు టెండర్లు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. విజన్ 2047 పేరుతో మాటలు కోటలు దాటుతున్నాయన్నారు. సామాన్యులకు ఉపయోగపడే పనులు చేయాలని, ఆ దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి అందరూ కృషి చేయాలని కోరారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ.. ఎపి అంటే అమరావతి, పోలవరం అనే ఆలోచనను మానుకోవాలని సూచించారు. ఎపి సీడ్ కార్పొరేషన్, టెస్టింగ్‌ల్యాబ్, కమిషనరేట్ రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కుందూ వెడల్పు పేరుతో లక్షల ఎకరాల ఆయకట్టును నాశనం చేయాలనే చర్యలను మానుకోవాలని కోరారు. ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ మాట్లాడుతూ.. కర్నూలు నిత్యం కరువు ప్రాంతంగా ఉందని, పాలకుల నిర్లక్ష్యం వల్ల వలసలు పోతున్నారని తెలిపారు. ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన వారికి ఉపాధి లేకుండా పోతోందన్నారు. రాబోయే కాలంలో చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పి.రామచంద్రయ్య మాట్లాడుతూ కరువుతో అనంతపురం జిల్లాలో ఎడారి ఛాయలు వస్తున్నాయన్నారు. హంద్రీనీవా పంట కాలువలు పూర్తి చేసి రైతులకు నీళ్లివ్వాలని కోరారు. సమావేశంలో జల సాధన సమితి అధ్యక్షులు రామ్ కుమార్, విద్యావంతుల వేదిక నాయకులు జి.భాస్కర్ రెడ్డి, ఎపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం పాల్గొన్నారు.