ఉద్యమ గళం విజయగౌరి

  • పరిచయ సభలో ద్రవిడ యూనివర్సిటీ మాజీ విసి కెఎస్‌.చలం, మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న, యుటిఎఫ్‌, వివిధ సంఘాలు బలపరిచిన కోరెడ్ల విజయగౌరి ఉద్యమ గళమని ద్రవిడ యూనివర్సిటీ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ కెఎస్‌.చలం, ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ అన్నారు. ఆమెను గెలిపించుకోవడం ద్వారా ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆస్కారం ఏర్పడుతుందని పేర్కొన్నారు.. విజయగౌరి పరిచయ సభ విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి మురళీ మోహన్‌ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సభలో కెఎస్‌.చలం మాట్లాడుతూ నేడు ప్రభుత్వ విద్యా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, దీన్ని కాపాడుకోలేకపోతే రాబోయే కాలంలో దేశాభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే విద్యారంగం కీలకమని పేర్కొన్నారు. నేడు ఉత్తరాంధ్ర మరింత వెనుకబాటులోకి నెట్టబడిందని, రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలు అమలు కాలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో రంగాన్ని పరిరక్షించుకోవడానికి, ఉత్తరాంధ్ర వాణి చట్టసభల్లో వినిపించడానికి విజయగౌరి గెలుపు అవసరమన్నారు. ఎంవిఎస్‌.శర్మ మాట్లాడుతూ విజయగౌరి గెలుపునకు అహర్నిశలూ ఉపాధ్యాయులు పనిచేయాలని కోరారు. విద్యారంగ పరిరక్షణకు ఇప్పటికే ఉద్యమాలు నడిపిన ఆమెను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లోని ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. జిఒ 117 ద్వారా ప్రభుత్వ విద్యా సంస్థలను బలహీనపరుస్తోందని వివరించారు. దీనిని అడ్డుకోవడానికి విజయగౌరిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా చట్టసభలోకి పంపాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ వర్గానికి పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ మాట్లాడుతూ విజయగౌరి గెలిస్తే ఉత్తరాంధ్ర వాణిని చట్టసభల్లో వినిపిస్తారన్నారు. సమావేశంలో సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కాంతారావు, సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, ఐద్వా జిల్లా కార్యదర్శి వై.సత్యవతి, యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు డి.రాము, ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు దాసరి నాగేశ్వరరావు, బిఆర్‌.అంబేద్కర్‌, జి.చిన్నబాయి, రమేష్‌ చంద్ర పట్నాయక్‌, ఈశ్వరరావు, రమేష్‌, భాస్కర్‌, బాబూరావు, శ్రీరామ్మూర్తి, చౌదరి రవీంద్ర, నాగమణి, కిశోర్‌ కుమార్‌, రెడ్డి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

➡️