కృష్ణ గుంటూరు జిల్లాల పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి
ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలో ఉన్న 1,20,000 మంది ప్రైవేట్ టీచర్లకు గుర్తింపు ఇచ్చేందుకు, వారి సమస్యల పైన కృషి చేస్తామని, కృష్ణ గుంటూరు ఉమ్మడి జిల్లాల పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. శనివారం ఎం.టి.ఎం.సి పరిధిలోని కుంచనపల్లి అరవింద హైస్కూల్, అరవింద సీబీఎస్సీ స్కూలులో టీచర్స్ ను, యుటిఎఫ్, ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆయన ఓట్లను అభ్యర్థిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ 2007 వరకు లెక్చరర్ గా పనిచేసిన తను గత 14 సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా శాసనమండలిలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల, అంగనవాడీలు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సమస్యల పైనే కాక, స్థానికంగా అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పైన ప్రజల గొంతుకై పనిచేశానన్నారు. సాధారణ ఎన్నికల కంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో సుమారు 25 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న నేపథ్యంలో తాను పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్నారు. ఈనెల 27వ తేదీన జరుగు ఈ ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేసి గెలిపించాలని ఆయన పట్టభద్రులను అభ్యర్థించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పైన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం.రామారావు, యుటిఎఫ్ నాయకులు ఆంజనేయులు, డి మాలకొండయ్య, సిఐటియు తాడేపల్లి మండల నాయకులు దొంతి రెడ్డి వెంకటరెడ్డి, కౌలు రైతు సంఘం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ, రైతు సంఘం మండల నాయకులు డోకిపర్తి రాజేంద్ర బాబు, కెవిపిఎస్ నాయకులు నాగ పోగు విజయరాజు, బుర్ర రాజు, సిఐటియు తాడేపల్లి పట్టణ నాయకులు దొంతి రెడ్డి విజయభాస్కర రెడ్డి, పల్లె భార్గవ్, జంగం రత్తయ్య, అరవింద స్కూల్ కరస్పాండెంట్ బి ఇంద్రాణి, చాగంటి అరవింద్, అరవింద స్కూల్స్ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
