మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలి
తరలిరావాలని విజ్ఞప్తి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కృష్ణా-గుంటూరు శాసన మండలి పట్టభద్ర నియోజకవర్గానికి ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు పట్టభద్ర ఓటర్లు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్, నిరుద్యోగ వంటి 50 సంఘాలు తనను బలపరిచాయని చెప్పారు. ఈ నెల 10న గుంటూరులో నామినేషన్ వేయబోతున్నానని, ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రం 2007లో శాసనమండలి పునరుద్ధరించిన తరువాత ఏడుగురు సభ్యులం స్వతంత్రంగా గెలిచి పిడిఎఫ్‌గా ఏర్పాడ్డామని వివరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పిడిఎఫ్ తరపున 14 మంది గెలిచారని తెలిపారు. రాజ్యాంగ విలువలు, లక్ష్యాల కోసం కట్టుబడి పనిచేశామన్నారు. ప్రజల పట్ల నిబద్ధతతో నిజాయతీగా పనిచేశామని పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, నిరుద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్‌వాడీ, ఆశాలు, నిరుద్యోగులు, రైతులు, కౌలు రైతుల సమస్యలపై శాసనమండలి వేదికగా గళమెత్తామని చెప్పారు. మండలి బయట వారి ఉద్యమాలకు సంపూర్ణ మద్దతు ఇచ్చామన్నారు. ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కోసం శాసనమండలిలో రాజ్యాంగ నిర్మాతలు పట్టభద్ర సీట్లు సృష్టించారని చెప్పారు. కొంతమంది మేధావులు, యూనియన్ నాయకులు, కార్మిక వర్గాల హక్కులు కాపాడే వ్యక్తులు ఎన్నిక కావాలనే ఉద్దేశంతో వీటిని సృష్టించారన్నారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు కూడా వీటిల్లోకి చొచ్చుకొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీలో ఉన్న వారికి అనేక ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. ధన, కులం వారికి అండగా ఉంటాయని వెల్లడించారు. తాము ప్రజాబలంతో ప్రజలు, అసంఘటిత రంగ కార్మికులు, బాధిత ప్రజల వాణిగా మండలిలో పనిచేస్తున్నామని చెప్పారు. ఈ ఎన్నికల్లో రెండు జిల్లాల్లో ఉన్న పట్టభద్ర ఓటర్లు పిడిఎఫ్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి గెలిపించాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌పి మనోహర్, ఎన్‌టిఆర్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె శ్రీనివాస్, ఎస్ సుందరయ్య పాల్గొన్నారు.
