- 12వ పిఆర్‌సి కమిషనర్‌ను నియమించాలని డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిజెఎసి సెక్రటేరియట్ సెక్రటరీ జనరల్‌గా యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్ ప్రసాద్ ఎన్నికయ్యారు. ఎపి ఎన్జీవో కార్యాలయంలో జెఎసి చైర్మన్ కెవి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన జెఎసి కార్యవర్గ సమావేశంలో శనివారం ఈ ఎన్నిక జరిగింది. కో చైర్మన్లుగా ఎపిటిఎఫ్-1938 అధ్యక్షులు జి హృదయరాజు, ఎపిటిఎఫ్-257 అధ్యక్షురాలు సిహెచ్ మంజుల, ఆప్టా ప్రధాన కార్యదర్శి కె ప్రకాష్‌రావు, వైస్ ప్రెసిడెంట్‌గా ఎపి అగ్రికల్చర్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు సాయికుమార్ ఎన్నికయ్యారు. 12వ పిఆర్‌సి నూతన కమిషనర్‌ను వెంటనే నియమించాల ని, ఆ నివేదిక సమర్పించేలోపు 30శాతం మధ్యంతర భృతిని ప్రకటించి అమలు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. పిఎఫ్, ఎపిజిఎల్‌ఐ రుణాల క్లెయిమ్‌లు, సరండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ మంజూరు చేయాలని, 11వ పిఆర్‌సి, డిఎ బకాయిలు చెల్లించాలని, సిపిఎస్ ఉద్యోగులకు 11నెలల మ్యాచింగ్ గ్రాంట్ జమచేయాలని, పంచాయితీరాజ్ శాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 3వేల కారుణ్య నియామకాలు వెంటనే జరపాలని, గత ప్రభుత్వంలో నిర్వహించిన సమయంలో పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలని సమావేశం కోరింది. ఎపి వైద్యవిధాన పరిషత్‌లో 10 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను మంజూరు చేయాలని, పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్ మంజూరు చేయాలని, సచివాలయ ఉద్యోగులకు స్టికర్స్, కరపత్రాల పంపిణీ నుంచి తప్పించాలని తదితర సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరింది. ఈ సమావేశంలో కో చైర్మన్లు ఎం రఘునాథరెడ్డి, చంద్రశేఖర్, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌లు చౌదరి పురుషోత్తం నాయుడు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.